పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..

Published Tue, Feb 7 2023 12:46 PM

Chhattisgarh: Brahmi Vasa Plant Cultivation Gives Farmers Good Profits - Sakshi

మాగాణి రేగడి భూముల్లో వరి, పెసర, మినుము మాత్రమేనా? ఇంకే ఇతర పంటలూ సాగు చేసుకోలేమా? ఉన్నాయి. ఔషధ పంటలున్నాయి. ఎకరానికి ఏటా రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం ఇచ్చే బ్రహ్మీ, వస వంటి దీర్ఘకాలిక ఔషధ పంటలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కొందరు రైతులు ఈ పంటలను నీటి వసతి ఉన్న మాగాణి నల్లరేగడి భూముల్లో సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ఔషధ మొక్కల బోర్డు వీరిని ప్రోత్సహిస్తోంది. ఆయుర్వేద ఔషధ పరిశ్రమదారులతో కొనుగోలు ఒప్పందాలు చేయించి సాగు చేయిస్తుండటం విశేషం. బహ్మీ, వస పంటల సాగులో అక్కడి ముగ్గురు రైతుల అనుభవాలను పరిశీలిద్దాం..  

బ్రహ్మీ.. 4 నెలలకో కోత
బ్రహ్మీ (Bacopa monneiri) నేల మీద పాకే తీగజాతి దీర్ఘకాలిక పంట. బ్రహ్మీ పంటను వరి పంటకు మాదిరిగానే దమ్ము చేసి, 2–3 అంగుళాల మొక్క కటింగ్‌ను నాటాలి. ఒకసారి నాటితే చాలు. 5 ఏళ్ల పాటు మళ్లీ నాటక్కర లేదు. 4 నెలలకోసారి పంట కోతకు వస్తుంది. అయితే, ఏడాది పొడవునా పంట పొలాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. పొలం అంతా బ్రహ్మీ మొక్కలు అల్లుకుపోతాయి కాబట్టి కలుపు సమస్య ఉండదు.

అయితే, పంట కోతకు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి కలుపు తీసి, తర్వాత కొడవళ్లతో నేల మట్టానికి బ్రహ్మీ మొక్కలను కోస్తారు. ఆ తర్వాత కొంచెం ఎరువు చల్లి నీటి తడి ఇస్తే చాలు.. పంట మళ్లీ ఏపుగా పెరుగుతుంది. ప్రతి కోతకు ఎకరానికి 3,000–6,000 కిలోల పచ్చి బ్రహ్మీ మొక్కల దిగుబడి వస్తుంది. ఆరుబయట గచ్చు మీద ఎండబెడితే.. కొద్ది రోజుల్లో 600–700 కిలోల ఎండు బ్రహ్మీ సిద్ధమవుతుంది.

దీని ధర మార్కెట్‌లో రూ. 40–50 వరకు ఉంటుంది. అంటే కోతకు రూ. 30 వేల చొప్పున.. ఏడాదిలో 3 కోతలకు.. రూ. 90 వేల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. ప్లాంటింగ్‌ మెటీరియల్‌ను రైతులకు మొదటిసారి ఔషధ మొక్కల బోర్డు ఇస్తుంది. పెరిగిన పంట నుంచి తీసి 2–3 అంగుళాల ముక్కలను నాటుకుంటున్నారు.

మొక్కలను ఎలా నాటుకోవాలో రైతులకు శిక్షణ ఇస్తారు. బ్రహ్మీ మొండి మొక్క. నిర్వహణ పెద్దగా అవసరం లేదు. ఒకటి, రెండు సార్లు కలుపు తీస్తే చాలు. ఎరువులు వాడాలని లేదు. జీవామృతం వాడినా సరిపోతుంది.   

వస..  9 నెలల పంట
పసుపు పంట మాదిరిగా వస (Bach-Acorus calamus) 2–3 అడుగుల ఎత్తున పెరుగుతుంది. 9 నెలల పంట. కొమ్ములను నాటుకోవాలి. మొక్కలు పెంచైనా నాటుకోవచ్చు. 9 నెలలకు కొమ్ములు తవ్వి తీసి, ఎండ బెట్టి, పాలిషింగ్‌ చేసి ఔషధ కంపెనీలకు విక్రయించాలి. 20–30 ఎకరాలకు ఒకటి చొప్పున పాలిషింగ్‌ మిషన్‌ అవసరం. ఎకరానికి 10–20 క్వింటాళ్ల వస కొమ్ముల దిగుబడి వస్తుంది. ఎకరానికి ఖర్చు రూ.20 వేలు పోను, రూ. 60 వేలు–లక్ష వరకు నికరాదాయం వస్తుంది.  

ఎకరానికి ఏటా రూ. 70 వేల నికరాదాయం
అశ్వని శబారియా.. గొరెల్లా పెండ్ర మర్వాహి జిల్లా పెండ్ర పట్టణ శివారులో ఈ యువ రైతు 10 నెలల క్రితం 9 ఎకరాల్లో బ్రహ్మీ, 2.5 ఎకరాల్లో వస సాగు ప్రారంభించారు. బీకాం చదువుకున్న అశ్వని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. తిపాన్‌ నది ఒడ్డున దేవుడి మాన్యం నల్ల రేగడి భూమిని కౌలుకు తీసుకొని, బోర్ల ద్వారా నీటిని తోడుకుంటూ సాగు చేస్తున్నారు.

బ్రహ్మీ నాటు మొక్కలు, వస విత్తన కొమ్ములను ఛత్తీస్‌గఢ్‌ ఔషధ మొక్కల బోర్డు ద్వారా తీసుకున్నారు. వర్మీ కంపోస్టు, వేపపిండి చల్లి దుక్కి చేసిన తర్వాత మొక్కలు నాటారు. తర్వాత ఎరువులేమీ వేయటేదు. వారానికి రెండు సార్లు తగుమాత్రంగా నీటి తడి ఇస్తున్నారు. ఈ రెండు పంటలకూ నీరు నిల్వ ఉండక్కరలేదు. మట్టిలో తేమ బాగా ఉంటే చాలు.

బ్రహ్మీ పంటను అశ్వని 10 నెలల్లో 3 సార్లు కోసి, ఎండబెట్టి విక్రయించారు. బ్రహ్మీ సాగు ద్వారా ఎకరానికి ఏడాదికి 3 కోతల్లో రూ. 90 వేల ఆదాయం. అన్నీ కలిపి రూ. 20 వేల ఖర్చవుతోంది. రూ. 70 వేలు నికరాదాయమని అశ్వని తెలిపారు. బ్రహ్మీలో వరి కన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నదన్నారు.

బ్రహ్మీ కొనుగోలుదారులను ఛత్తీస్‌గఢ్‌ ఔషధ మొక్కల బోర్డు పరిచయం చేసిందన్నారు. ఆన్‌లైన్‌లో నేరుగా విక్రయించడానికి ఇండియామార్ట్‌. కామ్‌ వెబ్‌సైట్‌లో కూడా తాను రిజిస్టర్‌ చేసుకున్నారు. మార్కెటింగ్‌ సమస్య లేదంటున్నారు రైతు అశ్వని శబారియా (81203 57007). 

ప్రకృతి సేద్యంలో ఏపుగా బ్రహ్మీ
డోమన్‌లాల్‌ సాహు.. బలోదబజార్‌ జిల్లా గైత్ర గ్రామంలో 25 ఎకరాల సొంత భూమిలో వరి, కంది, శనగ తదితర పంటలను 4 ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేస్తూ రసాయనిక ఎరువులు వాడే రైతులతో సమానంగా దిగుబడులు తీస్తున్నారు. 6 నెలల క్రితం బోర్డు ద్వారా మొక్కలు తెప్పించి 2 ఎకరాల నల్లరేగడిలో నాటారు.

పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరానికి వర్మీకంపోస్టు 2 క్వింటాళ్లు, 100 కిలోల ఘనజీవామృతం చల్లి దమ్ము చేసి, బ్రహ్మీ మొక్కలు నాటారు. వర్మీవాష్, వేస్ట్‌డీకంపోజర్, ద్రవ జీవామృతం 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌ ఔషధ మొక్కల బోర్డు ద్వారా విక్రయిస్తానని సాహు (62651 71801) తెలిపారు.  

రూ. 50–60 వేల నికరాదాయం 
సుగత్‌సింగ్‌ (66) జాంజ్‌గిర్‌ ఛాంప జిల్లా ఖటోల గ్రామానికి చెందిన సింగ్‌ వందెకరాల్లో సేద్యం చేసే రైతు. వరి, గోధుమ, పప్పుధాన్యాలు పండిస్తారు. 2021 జూలైలో ఛత్తీస్‌గఢ్‌ ఔషధ మొక్కల బోర్డు సూచన మేరకు నల్లరేగడి భూమి 3 ఎకరాల్లో బ్రహ్మీ, 2 ఎకరాల్లో వస నాటారు. ఎకరానికి 4 క్వింటాళ్ల సిటీ కంపోస్టు దుక్కిలో వేసి, అవసరం మేరకు నీటి తడులు ఇస్తున్నారు.

బ్రహ్మీ పంటను కోసి గచ్చుపై ఎండబెడుతున్నారు. వరిలో ఎకరానికి రూ. 30–35 వేలు నికరాదాయం వస్తుంటే.. బ్రహ్మీ, వసలో రూ. 50–60 వేల వరకు వస్తోందని సింగ్‌(83055 61057) తెలిపారు. మామిడి చెట్ల నీడలో సర్పగంధ మొక్కలను 16 నెలల క్రితం వేశారు. మరో 2 నెలల్లో కోతకు రానుంది. 

మార్కెటింగ్‌ సమస్య లేదు!
ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులు సాధారణ పంటలతో పోల్చితే అధిక నికరాదాయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరి సాగు చేసే నల్ల రేగడి, లోతట్టు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఔషధ పంటలైన బ్రహ్మీ, వసను సాగు చేసుకోవచ్చు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందే వీలుంది. విత్తనాలు, మొక్కలను బోర్డు ద్వారా అందించి రైతులను ప్రోత్సహిస్తున్నాం.

ఔషధాల తయారీదారులు, వ్యాపారులతో ముందే టైఅప్‌ చేసుకొని తగిన జాగ్రత్తలతో అవగాహన ఒప్పందం చేసుకొని మార్కెటింగ్‌ సమస్య లేకుండా చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు మంచి ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. ఎకరానికి ఏడాదికి రూ. పది లక్షల వరకు ఆదాయం వచ్చే ఔషధ పంటలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని రైతులకైనా, సంస్థలకైనా కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు మా బోర్డు సిద్ధంగా ఉంది. 
– జె.ఎ.సి.ఎస్‌.రావు (96769 95404), సీఈఓ, ఛత్తీస్‌గఢ్‌ ఔషధ మొక్కల బోర్డు, పూర్వ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్, రాయపూర్‌.
-నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
 

Advertisement
 
Advertisement
 
Advertisement