వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా.. | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా..

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు చర్యలు

అడవిలో సోలార్‌ పంపులతో నీటి సదుపాయం

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

బుట్టాయగూడెం: వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం పలు రకాల వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో పలు వన్యప్రాణులు కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వాటి దాహర్తి తీర్చేలా కృషి చేస్తున్నారు.

60 నీటికుంటల ఏర్పాటు

పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు వేసవిలో దాహర్తిని తీర్చేవిధంగా సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాల్వల్లో 20 చెలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్‌డ్యామ్స్‌ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటితొట్టెల్లో వేసవికాలంలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్‌ల ద్వారా బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, బీట్‌ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాహనాల్లో వెళ్ళలేని నీటి తొట్టెల వద్దకు బేస్‌క్యాంప్‌ సిబ్బంది వెళ్లి నింపుతారు. పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహర్తిని తీర్చుకుని ఉప్పు ముద్దను నాకుతాయని దీనితో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

నీటిని నింపేందుకు

రూ.1.50 లక్షల కేటాయింపు

వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా ప్రభుత్వం సుమారు రూ. 1.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబున్నారు. ఈ నిధులతో వేసవిలో అడవుల్లో నీటి తొట్టెలు నింపేందుకు మాత్రమే ఖర్చు చేస్తామని అధికారులు తెలిపారు.

పాపికొండల్లో

14 రకాల జంతువుల సంచారం

1,12,500 లక్షల హెక్టార్లలో పాపి కొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్‌లైఫ్‌ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమేరాలకు చిక్కుతున్నాయి. వాటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు, పాపికొండ అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, దున్నలు వంటి అనేక జంతువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పాపికొండల అభయారణ్యం లోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి తొట్టెలు నింపుతున్నాం, జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.

– ఎస్‌కే వలీ,

అటవీ శాఖ రేంజ్‌ అధికారి, పోలవరం

Advertisement
 
Advertisement
Advertisement