పాడికి వేసవి గండం ● వడదెబ్బ లక్షణాలు: వడదెబ్బ తగిలిన పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం గట్టి పడుతుంది. దీంతో మేత సరిగా మేయక పోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం, ఎదకు సరిగా రాకపోవడం, గర్భస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతాయి.
● చికిత్స: వడదెబ్బకు గురైన పశువులను గుర్తించి వెంటనే చికిత్స అందించాలి. పశువులను చల్లటి గాలి తగిలే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిని పశువు శరీరంపై, ముఖ్యంగా తల, మెడ భాగంలో పోయాలి. పశువులకు సరిపడా చల్లని తాగునీరు అందించాలి. నీటిలో ఎలక్ట్రాల్ పౌడర్ లేదా బెల్లం, ఉప్పు కలిపి ఇవ్వడం వల్ల శక్తి వస్తుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే స్థానిక పశు వైద్యుడిని సంప్రదించి అవసరమైన ఇంజెక్షన్లు లేదా సైలెన్ ఇప్పించాలి.
● పచ్చిమేతే రక్షణ: వేసవిలో పశువులకు పచ్చిమేత అందించాలి. పచ్చి గడ్డి పశువుల శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పచ్చి గడ్డి సదుపాయం లేని రైతులు పాత వేసిన యూరియా గడ్డిని అందిస్తే ఫలితం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గి పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. పశువుల పాక వద్ద దోమలు, ఈగల నివారణకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలి.
● పరిసరాల శుభ్రత ముఖ్యం: పశువుల కొట్టం/ షెడ్డును శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కొట్టంలో గాలి, వెలుతురు బాగా ప్రవేశించేలా ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రమైన చల్లని నీరు పశువులకు అందుబాటులో ఉంచితే మేలు. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధులకు కారణమయ్యే పిడుదులు, దోమలు, ఈగలను నిర్మూలించాలి. గేదెల పాకలు చల్లగా ఉండేలా చూసుకోవాలి. పాక పైకప్పును గడ్డితో కప్పి నీరు చల్లుతూ ఉండాలి.
వేసవిలో జాగ్రత్తలు ఇలా..
● పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాల దిగుబడిపై ప్రభావం
● జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పశువైద్యులు
యలమంచిలి : వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పశువులు అల్లాడిపోతుంటాయి. దీంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించి పశువులను సంరక్షించుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ పెంటపాటి వరప్రసాద్ పాడి రైతులకు సూచిస్తున్నారు.
పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే మేతకు తీసుకెళ్లాలి. రోజుకు రెండు, మూడు సార్లు చల్లని నీటితో కడగాలి. ఉష్ణోగ్రతలను అదుపు చేసేందుకు వీలుగా కొట్టం చుట్టూ తడిపిన గోనె సంచులు కట్టాలి. వీలైనంత వరకు పచ్చి గడ్డి అందించాలి. పశువులకు సరిపడా నీరు నిరంతరం అందుబాటులో ఉంచాలి.
– డాక్టర్ పెంటపాటి వరప్రసాద్, మండల పశు వైద్యాధికారి