ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన లక్ష్మీపురం ఆలయంలో శ్రీనివాసుని దివ్య కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం ఆలయ యాగశాలలో అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీనివాసుడు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక అలంకారాలు చేసి, హారతులిచ్చారు. రాత్రి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవాన్ని జరిపి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. వివాహం జరిగే ముందురోజు వధూవరులు తరఫు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు.
కల్యాణానికి ఏర్పాట్లు
శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి అట్టహాసంగా జరుపనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కల్యాణ మండప ప్రాంతాన్ని విద్యుద్దీపాలు, పుష్పమాలికలు, మామిడితోరణాలు, అరటి బోదెలతో సుందరీకరించారు.


