ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దులో ఉన్న అర్లగట్టును గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలు పెచ్చు మీరుతుండడంతో ‘కొండలనూ తవ్వేస్తున్నారు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ పీఎన్వీ ప్రసాద్ ఆదేశాలతో ఆర్‌ఐ యూనస్, వీఆర్వో సుబ్బయ్య గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలను పరిశీలించి కలెక్టర్‌కు నివేదికను పంపిస్తామని తెలిపారు. అనుమతులు లేకుండా గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏలూరు (టూటౌన్): గ్రామ పంచాయతీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయా లని కోరుతూ ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి కిషోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే గురువారం జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల్లో పంపు ఆపరేటర్లు, స్వీపర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎలక్ట్రిషీయన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్స్‌గా సుమారు 2 వేల మంది పనిచేస్తున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు వర్తింపజేయాలని, గుర్తింపు కార్డులు అందించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరులో అత్యాధునిక హంగులతో రూ.2.73 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకునేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించటమే ప్రధాన కర్తవ్యం అన్నారు. అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్‌రోడ్ పార్కును సందర్శించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు చంటి, ధర్మరాజు, ప్రభాకర్, ఆర్‌టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ అప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ పద్మశ్రీ, మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి ఆరేళ్లలో అందించే పోషకాహారమే ప్రధానమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. 8వ విడత పోషణ్ పక్వాడా పోస్టర్‌ను కలెకటరేట్‌లో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్య క్రమం ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు.
నీటి భద్రతపై సమీక్ష : జిల్లాలో చేపట్టాల్సిన కాల్వలు, చెరువుల మరమ్మతులు, పూడికతీత తదితర పనులకు అవసరమైన నిధుల వివరాలతో ప్రాథమిక ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతిపాదనలు రూపొందించడంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సూచనలు పరిగణనలోనికి తీసుకోవాలన్నారు.


