బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం కారుమబ్బులు కమ్మి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో సుమారు 2 గంటల పాటు వాన పడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం, దొరమామిడి, గుబ్బల మంగమ్మ గుడి, పులిరామన్నగూడెం గ్రామాలతోపాటు కొండ ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాటిని తొలగించి విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
పోలవరంలో ఈదురుగాలులతో వర్షం
పోలవరం రూరల్: మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలుల ప్రభావానికి అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బుట్టాయగూడెం రోడ్డు, అశ్వారావుపేట రోడ్డు, పాతబస్టాండ్ రోడ్డులో చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖాధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఏజెన్సీలో భారీ వర్షం