అమెరికా దిశ ఎటువైపు?

Vardelli Murali Editorial On America Election - Sakshi

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ పూర్తవుతుంది. అమెరికా చరిత్రలో ఇంత ఉత్కంఠ భరితంగా... ఇలా నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని సర్వేలూ విజేత డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెనేనని చెబుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే ఆయన 9 శాతం ఓట్ల ఆధిక్యతతో వున్నారు. క్రితంసారి అధ్యక్ష ఎన్నికల ముందు సర్వేలు చెప్పిన జోస్యాలకు భిన్నంగా ఫలితాలు వెలువడటం వల్ల ఈసారి సర్వే లపై ఎవరూ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. మిగిలిన రాష్ట్రాల మాటెలావున్నా తటస్థమైనవిగా పేరు బడిన నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, ఐయోవా, అరిజోనా, ఫ్లోరిడా తదితర 11 రాష్ట్రాల జనంలో స్పందన ఎలావుందన్నదే కీలకమని ఎన్నికల నిపుణులంటారు. అందుకే వారి ఓట్లను రాబట్టుకోవడానికి ప్రత్యర్థులిద్దరూ చివరివరకూ గట్టిగా ప్రయత్నించారు. ఐయోవాలో ట్రంప్‌ ఈ కృషిలో విజయం సాధించారని కూడా అంటున్నారు. గతంలో అక్కడ వెనకబడివున్న ట్రంప్‌ ఇప్పుడు బైడెన్‌కన్నా ముందంజలో వున్నారు. ఇప్పటికే తొమ్మిదికోట్ల 30 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అన్ని దేశాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికీ, అమెరికాలో జరిగే ఎన్నికల ప్రచారానికీ చాలా తేడా వుంటుంది. వేరే దేశాల్లో అక్కడి ఆర్థిక విధానాలు, అంతర్గతంగా వుండే ఇతరేతర సమస్యలు, చాలా తక్కువ స్థాయిలో ఇరుగు పొరుగు సంబంధాలు చర్చకొస్తాయి. కానీ అమెరికాలో అంతర్గత సమస్య లతోపాటు విదేశాంగ విధానం, ప్రపంచ దేశాల తీరుతెన్నులు కూడా చర్చనీయాంశాలే. అది చైనా కావొచ్చు, ఇరాన్‌ కావొచ్చు, సిరియా కావొచ్చు... అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థులు ఆ దేశాల్లోని పాలకులపై తమకు తోచిన తీర్పులిస్తారు. ఎవరెవరు అమెరికా ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నదీ వివరిస్తారు. తాము అధికారంలోకొస్తే ఆ దేశాలతో ఎలా వ్యవహరించదల్చుకున్నదీ చెబు తారు. ముఖ్యంగా భారత్‌పై ‘కడుపుమంట’ ప్రదర్శించడంలో రిపబ్లికన్‌లు ముందుంటారు. 2001 నుంచి 2009 వరకూ పనిచేసిన జార్జి డబ్ల్యూ బుష్‌ భారతీయులు ‘అతిగా’ తింటున్నారని, అందువల్లే ఆహారధాన్యాల ధరలు అదుపు తప్పాయని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. డెమాక్రాట్లు కూడా తక్కువేమీ కాదు.

భారత్‌ వంటి దేశాలు ఔట్‌ సోర్సింగ్‌ మాటున అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడు తున్నాయని 2012 ఎన్నికల్లో అప్పటి దేశాధ్యక్షుడు, డెమాక్రటిక్‌ అభ్యర్థి ఒబామా ఆరోపించారు. తనపై పోటీచేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి మిట్‌ రోమ్నీకి ఈ ఔట్‌సోర్సింగ్‌ సంస్థలతో సంబంధాలు న్నాయని నిందించారు. ఈసారి అధ్యక్ష చర్చలో ట్రంప్‌ మన దేశాన్ని రోత దేశమని వ్యాఖ్యానిం చారు. ప్రపంచాన్ని కాలుష్యమయం చేస్తున్న దేశాల్లో చైనా, రష్యా, భారత్‌లున్నాయని విమర్శిం చారు. అయితే విదేశాంగ విధానంకన్నా ఈసారి ఆంతరంగిక సమస్యలే అమెరికా ఎన్నికల్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. ట్రంప్‌ ఏలుబడిలో అమెరికాను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వాటిలో ప్రధానమైనది కరోనా వైరస్‌ మహమ్మారి. మొదట్లో ట్రంప్‌ అదొక సమస్యే కాదన్నట్టు మాట్లాడారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు అనవసరంగా ఆంక్షలు విధించి, ప్రజల స్వేచ్ఛను అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. శాస్త్రవేత్తలపై కూడా ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.

ఆ వైరస్‌ బారినపడి చనిపోతున్నవారి సంఖ్య పెరగడం మొదలెట్టాక చైనాపై నిప్పులు కురిపించారు. అలాగని అవసర మైన జాగ్రత్తలు తీసుకున్నది లేదు. నిజానికి అమెరికాలో పకడ్బందీగా వున్న వ్యవస్థలతో ఆ వ్యాధి విస్తృతిని అరికట్టడం సునాయాసంగా సాధ్యమయ్యేది. కానీ ట్రంప్‌ అయోమయ విధానాల వల్ల అవి చేష్టలుడిగి వుండిపోయాయి. ఆర్థికంగా కూడా అమెరికా కుదురుగా ఏమీ లేదు. మరో నాలుగేళ్లలో చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికాను మించిపోతుందని ప్రపంచబ్యాంకు తాజా గణాంకాలు చెబుతు న్నాయి. ప్రపంచ కర్మాగారంగా పేరుబడిన చైనాను ఇప్పట్లో అధిగమించడం అమెరికాతోసహా ఎవరికీ సాధ్యంకాదు. ఇప్పటికిప్పుడు పరిశ్రమల జోరు పెంచినా, చైనా మాదిరి చవగ్గా సరుకు ఉత్పత్తి చేయడం ఎవరికైనా అసాధ్యం. ట్రంప్‌ ఏలుబడిలో నిరుద్యోగిత తగ్గిందన్న పేరు వచ్చినా, కరోనా అనంతర పరిస్థితుల్లో అది వెనక్కుపోయింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి నిరు ద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. 

వాతావరణ మార్పులు, పర్యావరణం మొదలుకొని పన్ను విధానాల వరకూ రెండు పార్టీలూ ఉత్తర, దక్షిణ ధ్రువాలు. ప్రచారంలో కూడా ఇద్దరూ వేర్వేరు మార్గాలు అనుసరించారు. డెమాక్రాట్లు డిజిటల్, ఫోన్‌ మార్గాలు ఎంచుకోగా, రిపబ్లికన్లు  సంప్రదాయబద్ధంగా ఇంటింటికీ పోయారు. అయితే సర్వేలు నిజమై, తనకు అధికారం దక్కకపోవచ్చునన్న అనుమానం సహ రిపబ్లికన్లకన్నా ట్రంప్‌కే ఎక్కువుంది. కనుకనే అసలు ఎన్నికల ప్రక్రియపైనే జనంలో అనుమాన బీజాలు నాటేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. నవంబర్‌ 3న జరిగే ఎన్నికలపై కన్నేసి వుంచాలంటూ రిపబ్లికన్లకు చాన్నాళ్లనుంచే పిలుపునిస్తున్నారు. అదే సమయంలో న్యాయస్థానాల్లో బ్యాలెట్‌ పత్రాలపైనా, ఓటర్ల చెల్లుబాటుపైనా వ్యాజ్యాలు నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

హారిస్‌ కౌంటీలో 1,20,000కు పైగా ఓట్లు చెల్లుబాటు కాదని ప్రకటించాలని టెక్సాస్‌ సుప్రీంకోర్టులో రిపబ్లికన్లు దాఖలు చేసిన కేసు వీగిపోయింది. దానిపై అప్పీల్‌కు వెళ్లదల్చుకున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. పెన్సిల్వేని యాలో కూడా ఈ మాదిరి కేసే నడుస్తోంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అనిశ్చితిలో పడేసి, జనంలో అయోమయం సృష్టించడానికి ట్రంప్‌ చేసే ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయన్నది చూడాల్సివుంది. భవిష్యత్తుపై బెంగతో అమెరికా మార్కెట్లు ఇప్పటికే భారీ కుదుపులకు లోనవుతున్నాయి. అమెరికా ఓటర్లు తిరుగులేని తీర్పునిస్తే తప్ప ఇవి కుదుటపడవు. గెలుపోటముల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోతే అమెరికాకు రానున్న నెలల్లో కూడా తిప్పలు తప్పవు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top