ఇవాళ్టి అవసరం!

Sakshi Editorial On Media Council

ఎవరైనా, ఏదైనా మారుతున్న కాలానికి తగ్గట్టు మారాల్సిందే. నవంబర్‌ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకొని, దేశంలోని పత్రికా రంగాన్నీ, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)ను గుర్తుచేసుకున్న పక్షం రోజులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమర్పించిన నివేదిక మారుతున్న మీడియా ప్రపంచంతో మారాల్సిన విధానాలను స్పష్టం చేసింది. పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్‌ – ఇలా విస్తరించిన మీడియా అంతటినీ పర్యవేక్షించేలా ‘మీడియా కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

అవ్యవస్థలకూ, అక్రమాలకూ అడ్డుకట్ట వేసేలా కౌన్సిల్‌కు చట్టబద్ధమైన అధికారాలు కట్టబెట్టాలంది. ఇప్పటికే ప్రెస్‌ కౌన్సిల్‌ ఉన్నా, దాని ప్రభావం పరిమితమే. అందుకే, వర్తమానానికి అవసరమైన మీడియా కౌన్సిల్‌ ఏర్పాటు కోసం నిపుణులతో ఓ కమిషన్‌ వేయాలంది.

ప్రింట్‌ మీడియాకు ఎప్పటి నుంచో చట్టబద్ధమైన ప్రెస్‌ కౌన్సిల్‌ ఉంది. కానీ, టీవీకి అలాంటిది లేదు. సంస్థలుగా వృద్ధి చెందిన జాతీయ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రమాణాల సంస్థ (ఎన్‌బీఎస్‌ఏ), న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్ల అసోసియేషన్‌ (ఎన్‌బీఏ)లకేమో ప్రభుత్వ అధికారిక గుర్తింపు లేదు. మరోపక్క, మన దేశంలో ఎన్ని ఇంటర్నెట్‌ వెబ్‌సైట్లున్నాయో ఎలక్ట్రానిక్స్‌ – ఐటీ శాఖలో రికార్డు లేదు. ఓ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వెబ్‌సైట్లున్నాయి.

వాటిలో కనీసం 20 కోట్ల సైట్లు చురుకుగా పనిచేస్తున్నాయి. మన దేశంలో 1.44 లక్షల వార్తాపత్రికలు, మేగజైన్లున్నాయి. 926 ఉపగ్రహ టీవీ ఛానళ్ళు (387 న్యూస్‌ ఛానళ్ళు, 539 నాన్‌–న్యూస్‌ ఛానళ్ళు), 36 దూరదర్శన్‌ ఛానళ్ళు, 495 ఆకాశవాణి ఎఫ్‌.ఎం. కేంద్రాలు, 384 ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం. రేడియోలు ఉన్నట్టు లెక్క. ఇవి కాక నేటి సోషల్‌ మీడియా. అందుకే, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సారథ్యంలోని స్థాయీ సంఘం బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన ‘మీడియా కవరేజ్‌లో నైతిక ప్రమాణాలు’ నివేదికలోని అంశాలు కీలకం.

నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తున్న రోజులివి. వాటితో కుస్తీ సాగుతుండగానే, మరోపక్క సామాజిక మాధ్యమ వేదికల వల్ల పత్రికా రచన పౌరుల చేతుల్లోకి వచ్చింది. కొన్ని లోపాలున్నా పౌర పాత్రికేయం మంచిదే. అయితే, వ్యాప్తి పెరుగుతున్న డిజిటల్‌ మీడియాలోనూ విశృంఖలత విజృంభిస్తోంది. అందుకే, డిజిటల్‌ మీడియాలో నిర్ణీత నైతిక నియమా వళిని పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంఘం సూచించింది.

అది కావాల్సిన, రావాల్సిన మార్పు. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూ ఆ పని చేయాలంది. అది ఆమోద యోగ్య మార్గం. అలాగే, ఈ ఏడాదే ప్రకటించిన ‘ఐటీ రూల్స్‌ 2021’ డిజిటల్‌ మీడియా వేదికల్లో జవాబుదారీతనం తెస్తాయనీ, కంటెంట్‌ నియంత్రణలో ఉపకరిస్తాయనీ స్థాయీసంఘం ఆశిస్తోంది. 

ఇవాళ్టి డిజిటల్‌ యుగంలోనూ ప్రభుత్వాలు విధిస్తున్న నెట్‌ నిషేధాలూ చూస్తున్నాం. కానీ, దేశ భద్రత, సమైక్యత పేరిట ఫోన్‌ సర్వీసులు, ఇంటర్నెట్‌పై నిషేధంతో ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లుతుంది. ఆర్థిక పురోగతీ దెబ్బతింటుంది. అత్యవసర పరిస్థితులంటూ ఫోన్, నెట్‌ సేవలను నిషేధించడం వల్ల టెలికామ్‌ ఆపరేటర్లకు ప్రతి సర్కిల్‌ ఏరియాలో గంటకు రూ. 2.4 కోట్ల నష్టం వస్తుందని అంచనా. గంపగుత్తగా ఇలా నిషేధం పెట్టి నష్టపరిచే కన్నా, అవసరాన్ని బట్టి ఫేస్‌బుక్, వాట్సప్, టెలిగ్రామ్‌ లాంటి సర్వీసులను ఎంపిక చేసుకొని ఆ నిర్ణీత వేళ వాటిని నిషేధించే ఆలోచన చేయాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇదీ ఆచరణాత్మకమే అనిపిస్తోంది.

1995 నాటి కేబుల్‌ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టంలో మార్పులు తేవాలనీ స్థాయీ సంఘం అంటోంది. అలా చట్టాన్ని సవరిస్తే– ఫిర్యాదులపై పాలకుల ఇష్టారాజ్యపు కార్యనిర్వాహక ఉత్తర్వుల మేరకు కాక, చట్టప్రకారం వ్యవహరించవచ్చు. ఇక, ‘కేబుల్‌ నెట్‌వర్క్‌ రూల్స్‌–2014’లోని ‘జాతి వ్యతిరేక వైఖరి’ అనే పదాన్ని సమాచార ప్రసార శాఖ సరిగ్గా నిర్వచించాలన్న మాట స్వాగతనీయం. ప్రైవేట్‌ టీవీ ఛానళ్ళను అనవసరంగా వేధించడానికి ఆ పదం ఆయుధమవుతున్న సందర్భాలు న్నాయి.

ఆ మధ్య కేరళలో రెండు టీవీ ఛానళ్ళకు అదే జరిగింది. ఇటీవల ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) వేదికలూ ఊపందుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో, ఓటీటీ వేదికల్లో నియంత్రణ లేని అన్ని రకాల కంటెంట్‌ అందుబాటులో ఉంటోంది. ఏ పరిధిలోకీ రాకుండా తప్పించుకుంటున్న వీటిపైనా ఈ స్థాయీ సంఘం దృష్టి పెట్టింది. అనియంత్రిత ఓటీటీ కంటెంట్‌ పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. అలాగని ఏది చూడాలి, ఏది వద్దనే వీక్షకుడి స్వేచ్ఛను ప్రభుత్వం కఠిన చర్యలతో కత్తిరించడమూ కరెక్ట్‌ కాదు. స్థాయీ సంఘం సైతం అంగీకరించిన వీటిని దృష్టిలో పెట్టుకొని నియమావళి చేయాలి.

ప్రతిపాదిత ‘మీడియా కౌన్సిల్‌’ ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధనకు పనిచేసే నిపుణుల కమిషన్‌ ఆరు నెలల్లో తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఆపైన ప్రభుత్వం చొరవ చేస్తే, ప్రెస్‌ కౌన్సిల్‌కు భిన్నంగా అన్ని మీడియాలనూ పర్యవేక్షించే మీడియా కౌన్సిల్‌ వస్తుంది. డిజిటల్‌ మీడియాకూ నైతిక వర్తనా నియమావళిని చేశాక, అది అమలయ్యేలా చూడడం మరో ఎత్తు. అందుకు సమాచార, ఐటీ శాఖలు కలసి పనిచేయడం అవసరం.

అదే సమయంలో కొత్త కౌన్సిల్, నియమావళి దుర్వినియోగం కాకుండా చూడడమూ అంతే అవసరం. పాలకులు తమ స్వార్థం, కక్ష సాధింపుల కోసం వాటిని వినియోగించుకొంటే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛకూ, మీడియాకూ అండనిచ్చిన 14, 19, 21వ రాజ్యాంగ అధికరణాలను ఉల్లంఘించకుండా అదుపాజ్ఞలూ కావాలి. అలాంటి సమగ్ర నియమావళి, సమర్థ మీడియా కౌన్సిల్‌ ఏర్పడితే మంచిదే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top