
కయ్యానికి కాలుదువ్వటం, గిల్లికజ్జాలకు దిగటం చైనాకు అలవాటైన విద్య. అందులో భాగంగానే మన అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాలకు మాండరిన్ పేర్లు తగిలించి మళ్లీ పేచీకి దిగింది. తమ దేశంలో పేర్లు మార్చుకుంటే అది అంతర్గత వ్యవహారమవుతుంది. దాని వెనక ఏ సెంటిమెంటువున్నదో బయటివారికి అనవసరం. కానీ పొరుగు ప్రాంతాలకు కొత్త పేర్లు ఆలోచించే భారాన్ని ఎందుకు నెత్తినేసుకున్నట్టు? ఏదైనా ప్రాంతాన్ని సొంతం చేసుకునేముందు ఆ ప్రాంతానికి తమదైన పేరు తగిలిస్తే సరిపోతుందని చైనా నేతలు భావిస్తున్నట్టున్నారు. సంబంధాలు మెరుగుపడతాయనుకున్న ప్రతిసారీ కొత్త పేచీకి దిగటం చైనాకు రివాజైంది.
2020లో గల్వాన్ లోయలో అకారణంగా ఘర్షణ లకు దిగి మన జవాన్లు 20మందిని బలితీసుకుంది. తాను కూడా మన జవాన్ల చేతుల్లో భారీ నష్టం చవిచూసింది. చర్చోపచర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగవుతు న్నాయి. మానస సరోవర యాత్రకు మన యాత్రికులను అనుమతిస్తామని నాలుగేళ్ల తర్వాత ఇటీ వలే చైనా ప్రకటించింది. ఈలోగానే హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అరుణాచల్‌పై ఏదోరకంగా ఆధిప త్యాన్ని చాటుకునే ప్రయత్నం చేయటం, దాన్ని ‘వివాదాస్పద ప్రాంతం’గా అభివర్ణించటం చైనా ఎప్పుడూ మానుకోలేదు.
ఇరు దేశాల మధ్యా సుహృద్భావ సంబంధాలు ఏర్పడి అయిదు దశాబ్దాల వుతోంది. శిఖరాగ్ర సమావేశాలు జరగటం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదరటం, ఇరువైపులా పౌరులు రాకపోకలు సాగించటం వంటివన్నీ కొనసాగుతున్నాయి. కానీ మన అధినేతలెవరైనా అరుణాచల్ వెళ్లినప్పుడల్లా మతిభ్రమించినట్టు గొడవకు దిగటం అలవాటైంది. గగనతలాన్ని అతిక్రమించి అరుణాచల్‌లోకి చైనా యుద్ధ విమానాలు చొచ్చుకురావటం కూడా షరా మామూలే.
ఈ చిత్ర విచిత్ర విన్యాసాల్లో భాగమే అరుణాచల్‌లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడం. మొదటగా 2017లో దీన్ని ప్రారంభించింది. అటు తర్వాత 2021నుంచి వరసగా ఇదే పని చేస్తోంది. మళ్లీ తాజాగా మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించింది. 2017లో మొత్తం ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇంచుమించు ఆ రాష్ట్రం నలుదిక్కులావున్న ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. 2021లో 15 జనావాస ప్రాంతాలూ, నాలుగు పర్వతాలూ, రెండు నదులూ, ఒక పర్వతప్రాంత మార్గమూ ఎంపిక చేసుకుని మాండరిన్ పేర్లు పెట్టింది. 2023లో 11, ఆ మరుసటేడాది 30 ప్రాంతాలు ఎంపిక చేసుకుని పేర్లు మార్చింది.
తాజాగా 27 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. ఇందులో రెండు భూభాగాలూ, రెండు జనావాస ప్రాంతాలూ, అయిదు పర్వత శిఖరాలూ, రెండు నదులతోసహా అనేకం ఉన్నాయి. ఈసారి అదనపు విశేషం ఏమంటే... వీటిని పాలనాపరమైన సబ్ డివిజన్లుగా విభజించి ఏవి ఏ పరిధిలోకొస్తాయో ఏకరువు పెట్టింది. పైకి చూడటానికి ఇదంతా తెలివితక్కువతనంగా, పనికిమాలిన చర్యగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఆ ప్రాంతాలు తనవేనని దబాయించటానికే ఇంత శ్రమ తీసుకుంటున్నదని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులంటారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో దీవులకు కూడా ముందు ఈ మాదిరిగానే పేర్లు తగిలించి, అటుతర్వాత అవి ఎప్పటినుంచో తమవని పేచీకి దిగింది. జపాన్‌తోనూ సెంకాకు దీవుల విషయంలో ఇదే మాదిరిగా గొడవ ప్రారంభించింది.
అరుణాచల్‌లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తనదిగా చెప్పుకోవటం చైనాకు ఎప్పటినుంచో అలవాటు. మన దేశం బ్రిటిష్ వలసపాలకుల ఏలుబడిలోవుండగా 1914లో సిమ్లాలో భారత్, టిబెట్‌ల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. దాని ఆధారంగా ఉనికిలోకొచ్చిన మెక్‌మెహన్ రేఖ రెండు ప్రాంతాలనూ విభజిస్తుంది. ఆ సమయంలో చర్చల్లో పాల్గొన్న చైనా ప్రతినిధి ఇందుకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించాడు. అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చు కునే స్వాతంత్య్రం టిబెట్‌కు లేదని వాదించాడు. 1949లో అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకొచ్చాక వారు కూడా ఈ వాదననే తలకెత్తుకున్నారు.
చారిత్రకంగా అరుణాచల్... టిబెట్‌లో అంతర్భాగమని చెబుతూ అందుకు తవాంగ్, లాసాల్లోని బౌద్ధారామాల మధ్య ఉన్న సంబంధాలను ఏకరువు పెడుతోంది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా భావిస్తూ తనదైన మాండరిన్‌లో జంగ్నాన్ అనటం, అక్కడివారికి విడి వీసాలు జారీచేయటం కూడా పాత ధోరణే. ఒకపక్క వాస్తవాధీనరేఖ వద్ద అయిదేళ్ల క్రితం జరిగిన ఘర్షణలపై చర్చలు సాగుతూ, ఇప్పుడి ప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా మళ్లీ పేర్ల జోలికి పోవటంలో మతలబువుంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు చైనా అందించిన ఆయుధ సామగ్రి సంగతి వెల్లడైంది. అవి మన త్రివిధ దళాల శక్తిముందు సరిపోలేదు. మనతో చెలిమికి చిత్తశుద్ధితో ప్రయత్ని స్తున్నట్టు కనబడుతూనే ఈ వివాదంలో పాక్ పక్షం చేరింది.
ఈ సమయంలో పేర్ల వివాదం రాజేస్తే దృష్టి మళ్లించటం సులభమవుతుందని చైనా అంచనా వేసుకున్నట్టు కనబడుతోంది. వ్యూహాత్మకంగా అరుణాచల్ మనకెంతో ముఖ్యమైనది. ఈశాన్య భారత్‌కు ఇది రక్షణకవచంగా ఉపయోగపడు తుంది. ఈ ప్రాంతాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటే ఆగ్నేయాసియా దేశాలతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని చైనా ఆశిస్తోంది. అదీగాక ఇక్కడ సహజవనరులు పుష్కలంగావున్నాయి. జల విద్యుదుత్పత్తికి వీలుంటుంది. ఈ ప్రాంత నదుల్ని గుప్పెట్లో పెట్టుకుంటే భవిష్యత్తులో నీటిని ఆయుధంగా వాడుకోవచ్చు. ఇంత దురాలోచనతో చైనా వేస్తున్న ఎత్తుగడలను మొగ్గలోనే తుంచటం, పేర్లు మార్చినంతమాత్రాన భౌగోళిక వాస్తవికతలు తారుమారు కావని చెప్పటం అవసరం.