
డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్.. కూటమి సర్కారు
● ఏ రైతు ముఖంలోనూ సంతోషం లేదు
● వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల
సీతానగరం: కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఎన్నికల హామీలు అమలు చేయని ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. ఇనుగంటివారిపేటలోని శ్రీ లంకాలమ్మ అమ్మవారి జాతరలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, శ్యామల విలేకర్లతో మాట్లాడుతూ, హామీలు నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని అన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అనారోగ్య కారణాలు చెప్పి బెయిల్‌పై బయటకు వచ్చారని, ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ రైతు ముఖంలో చిరునవ్వు, మనస్సులో సంతోషం లేవని, ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, అటువంటివేవీ కూటమి ప్రభుత్వంలో జరగడం లేదని అన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల కోసం కొంత నిధి ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పొగాకు రైతుల కోసం గత ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే, నేడు నష్టపోతున్న వారి కోసం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యాన ఈ నెల 28న రైతన్న పోరుబాట నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యాన రాజానగరం నియోజకవర్గాన్ని రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పథంలో నడిపించారని శ్యామల కొనియాడారు. కాతేరు – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంతో పాటు పాఠశాలలను అభివృద్ధి చేశారని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుదనే భరోసా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రజలు మాత్రం రాజాతోనే ఉన్నారని శ్యామల అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తోట నరసింహం, యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, సర్పంచ్ సత్యం రాంపండు, వైస్ ఎంపీపీ–2 సత్య మదన్‌బాబు, పార్టీ మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, కో కన్వీనర్ కరుటూరి శ్రీహరిబాబు, మాజీ ఎంపీపీ పెందుర్తి దేవదాసు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, నాయకులు చల్లమళ్ళ సుజీరాజు, కవల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.