ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంపై ఆందోళనలు
అమలాపురం టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ చట్టానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును మార్చి పేదల హక్కులను కాలరాస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కూడా ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో గ్రామీణ పేదలతో పాటు రైతులు, కౌలు రైతులు, రైతాంగానికి మద్దుతు ఇచ్చే ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కీలక అంశాలను తొలగించి ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని వెంకటేశ్వరరావు అన్నారు.
కళాశాలల బస్సుల తనిఖీ
అమలాపురం రూరల్: రహదారి భద్రతా చర్యల్లో భాగంగా అమలాపురంలో రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థకు చెందిన 43 బస్సులను తనిఖీ చేశారు. ఇందులో నాలుగు బస్సుల్లో సాంకేతిక లోపాలను గుర్తించి కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాలల, కళాశాలల నిర్వాహకులు సహకరించి, వారం రోజుల్లోగా లోపాలను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి, సురేష్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
19న ఖేలో ఇండియా
బీచ్ గేమ్స్ ఎంపికలు
అమలాపురం రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 సంబంధించి సీ్త్ర, పురుషులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు 19న ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా నది సమీపంలో మణిపాల్ హాస్పిటల్ వద్ద జరుగుతాయని జిల్లా క్రీడా ప్రాధికార అధికారి వైకుంఠ రుద్ర బుధవారం తెలిపారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్ సాకర్, బీచ్ సెపక్ తక్రాలో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, లేదా పాస్‌పోర్ట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ నిర్ధారణ ధ్రువీకరణ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకు రావాలన్నారు. ఇటీవల జాతీయ చాంపియన్ షిప్ ఫలితం, ర్యాంకింగ్ సర్టిఫికెట్, సంబంధిత అధికార సంస్థ ద్వారా పంపిన నోటిఫికేషన్ పత్రం జత చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికలు, ఇతర వివరాలకు 91211 06836 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు.


