వాసురాజూ.. ఆరోగ్యం ఎలా ఉంది?
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న
వ్యక్తిని పలకరించిన మాజీ సీఎం జగన్
అమలాపురం టౌన్ : వాసురాజు...ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్రమంగా జరిగింది కదా...అని అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన నడింపల్లి వాసురాజును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వాసురాజు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ సూచనలతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రూ.20 లక్షలు సహాయం చేశారు. ఆ డబ్బుతో అప్పట్లో వాసురాజు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్‌లు వాసురాజును వెంట పెట్టుకుని మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. మీరిచ్చిన రూ.20 లక్షలతోనే వాసురాజుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందని జగన్‌కు విశ్వరూప్ వివరించారు. వాసురాజు ఆరోగ్య యోగ క్షేమాలను జగన్ అడగడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు.


