
రత్నగిరి మెయిన్ క్యాంటీన్ వద్ద మినీ క్యాంటీన్
అన్నవరం: రత్నగిరిపై ఈఓ కార్యాలయం దిగువన మెయిన్ క్యాంటీన్ వద్ద మినీ క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం శుక్రవారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంలో నెలకు రూ.1.80 లక్షలకు పాలక మండలి శుక్రవారం రాత్రి పాట ఖరారు చేసింది. ఈ మినీ క్యాంటీన్ దక్కించుకున్న పాటదారు కార్తిక మాసం నుంచి ఇక్కడ కాఫీ, టీ, ఫలహారాలు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయించాల్సి ఉంటుంది. భోజనాలు పెట్టేందుకు, వివాహాది శుభకార్యాలకు భోజనాలు అడ్వాన్స్‌గా బుక్ చేసేందుకు అవకాశం లేదని దేవస్థానం పేర్కొంది. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర అధికారులతో సమావేశమై పాలక మండలి తరఫున పలు తీర్మానాలు చేశారు.
ఇతర తీర్మానాలు
● దేవస్థానం విశ్రాంత వేద పండితుడు, త్రివేది కపిలవాయి రామశాస్త్రి సోమయాజులును ప్రత్యేక వైదిక సలహాదారుగా, దైవజ్ఞ బ్రహ్మ తంగిరాల వేంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతిని దేవస్థానం సిద్ధాంతిగా నియమించారు.
● సర్క్యులర్ మండపంలో వెదురుతో చేసిన రోలింగ్ మ్యాట్లు వేలాడదీయడానికి 1,230 అడుగులకు రూ.61,500తో కొనుగోలు చేయాలి.
● స్మార్త ఆగమ పాఠశాల వసతి గృహాల్లో రూ.6 లక్షలతో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు కొనుగోలుకు ఆమోదం.
● సత్యదేవుని గిరి ప్రదక్షిణలో భక్తులకు పంపిణీ చేయడానికి టెండర్ ద్వారా 70 పైసలకు వాటర్ ప్యాకెట్, రూ.6.70కు వాటర్ బాటిల్ కొనుగోలుకు తీర్మానం.
● ప్రకాష్ సదన్‌లో పాడైన విద్యుత్ స్విచ్ బోర్డులు, స్విచ్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు పిలిచిన టెండర్ రూ.4.72 లక్షలకు ఆమోదం.
● సత్యదేవుని తెప్పోత్సవం రోజున విద్యుద్దీపాలంకరణ టెండర్‌కు రూ.6.14 లక్షలతో ఆమోదం.
● తెప్పోత్సవం ఏర్పాట్లకు దత్తత ఆలయాలైన తొండంగి ఉమా రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో రూ.90 వేలు, కోరుకొండ దేవస్థానంలో రూ.1.40 లక్షలు ఖర్చు చేయాలి.
● దేవస్థానం టోల్‌గేట్‌లో కార్లు, తదితర వాహనాల టోల్ వసూలుకు గాను నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలం నెలకు రూ.18,88,888కు ఖరారైంది.