
అన్న ప్రసాద భవనానికి విరాళాలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఎన్ చైతన్యజనార్థన్, సిందూరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,307, వీ వినోద్, సులోచనారాణి దంపతులు రూ 50,307 వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
అయినవిల్లి ఆలయానికి
పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారి సన్నిధిలో భక్తులు లఘున్యాస అభిషేకాలు, ఉండ్రాళ్ల పూజ, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకున్నారు. అక్షరాభ్యాసం, అన్న ప్రాసన, తులాభారం, ఆశీర్వచనం పూజలు కూడా చేయించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,996 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్న ప్రసాదానికి రూ.1,95,295 విరాళాలుగా అందించారన్నారు.
తాగునీరు, వీధి దీపాలను
బంద్ చేస్తాం
ఉధృతమవుతున్న మున్సిపల్
ఇంజినీరింగ్ వర్కర్స్ సమ్మె
అమలాపురం టౌన్: రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు అమలాపురంలో చేపట్టిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. అమలాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుంచి సమ్మె చేస్తున్న 50 మంది వర్కర్లు మోకాళ్లపై నిలబడి ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఆదివారం నుంచి తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నామని మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం.దుర్గా అర్జునరావు ప్రకటించారు. ఆదివారం నుంచి తాము విధులు నిర్వర్తించే తాగునీరు, వీధి దీపాలను కూడా బంద్ చేస్తూ నిరసన స్థాయిని పెంచుతున్నట్లు వివరించారు. ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62కి పెంచాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, జీతాలను టెక్నికల్, నాన్ టెక్నికల్‌గా పెంచి ఇవ్వాలన్న డిమాండ్లతో వారు సమ్మె బాట పట్టారు. అమలాపురం యూనియన్ అధ్యక్షుడు దంగేటి షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి యెరుబండి వెంటక సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నాగారపు శ్రీనివాస్, యూనియన్ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.

అన్న ప్రసాద భవనానికి విరాళాలు

అన్న ప్రసాద భవనానికి విరాళాలు