రోడెక్కిన రైతన్నలు | - | Sakshi
Sakshi News home page

రోడెక్కిన రైతన్నలు

Mar 26 2025 12:05 AM | Updated on Mar 26 2025 12:05 AM

రోడెక్కిన రైతన్నలు

రోడెక్కిన రైతన్నలు

సాగునీరు అందించాలని డిమాండ్‌

ఉప్పలగుప్తం: సాగునీరు అందించండి మహాప్రభో అంటూ రైతులు మంగళవారం రోడ్కెక్కారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట ఉన్న సరిపల్లి, మునిపల్లి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ట్రాఫిక్‌ను నిలుపుదల చేసి ధర్నా చేపట్టారు. నీరు అడిగితే రైతులపై ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో కేసులు పెడతారా అంటూ అధికారులపై ఆగ్రహించారు. ప్రభుత్వ అధికారులు మండలానికి సాగు నీరు అందిండంలో పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. చేలు పొట్ట దశలో ఉన్నాయని ఈ సమయంలో అధికారులు నీరు అందించకపోతే ఎలా అంటూ వాపోయారు. రైతుల పట్ల ప్రభుత్వ అధికారుల పక్షపాత వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సాగునీరు అందక వరి చేలు బీడు వారుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై ఎస్‌ఐ సీహెచ్‌ రాజేష్‌ కలుగచేసుకుని రైతులపై స్థానిక స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ముమ్మిడివరం స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తాము జవాబుదారులం కాదని వివరించటంతో అందోళనను తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు మార్చారు. తహసీల్దార్‌ వి.ఎస్‌.దివాకర్‌ సమక్షంలో సీఐ ప్రశాంత్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కె.గోపీనాథ్‌, ఈఈ బి. శ్రీనివాసరావు, ఏఈ ఎస్‌.వి.వి.ఎన్‌.పవన్‌ రైతులతో చర్చించారు. అఽధికారులు క్షమాపణ చెప్పాలని కూటమి నాయకులు ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఇరిగేషన్‌ అధికారులు పది రోజులు పాటు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు. రైతులపై అధికారులు కేసులు పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై ఏఈ పవన్‌ను వివరణ కోరగా, అటువంటిది ఏమీ లేదని సెక్షన్‌ చానల్‌ దగ్గర ప్రస్తుతం పల్లంకుర్రు ఆయకట్టు వంతు నడుస్తోందన్నారు. వంతు లేని సమయంలో ఈ ప్రాంతం రైతులు దౌర్జన్యంగా అడ్డును తొలగించి మా అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు కావాలని ముమ్మిడివరం పీఎస్‌లో అభ్యర్థించామని ఆయన సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement