
140 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
కాజులూరు: అయితపూడిలోని మాజీ సర్పంచ్, పారిశ్రామిక వేత్త కొల్లు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి, సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గత బుధవారం తిరుపతి, ఇతర తీర్థయాత్రలకు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా ఇంటిలోని ఇనుప బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దానిలో 140 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు బుధవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, డాగ్ స్క్యాడ్, క్లూస్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు.