
సముద్రంలో ముమ్మరంగా గాలింపు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో గల్లంతైన మేరుగు శ్యామ్ కోసం బుధవారం కుడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. మత్స్యకారులు, అధికారులు నాలుగు బోట్లపై అతడి కోసం వెతుకుతున్నారు. అయితే తుపాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
సారా నిందితుడిపై
పీడీ యాక్ట్
ప్రత్తిపాడు: పెద్దిపాలెం గ్రామంలో సారా నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పలుమార్లు సారా కేసులో నిందితుడిగా ఉన్న నడిగట్ల నూకరాజును అరెస్టు చేసి, పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించినట్టు చెప్పారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు
కపిలేశ్వరపురం: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం అంగర పోలీస్ స్టేషన్‌లో మండపేట రూరల్ సీఐ దొరరాజు వెల్లడించారు. ఆ ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర ఆర్‌అండ్‌బీ రహదారిలోని రైస్‌మిల్లు సమీపంలోని కిళ్లీకొట్టు వద్దకు మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన మన్యం వీర వెంకట సత్య సీతారామారావు వచ్చాడు. తన దగ్గర ఉన్న రూ.500 నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె కొన్నాడు. ఆ నోటు నకిలీదని కిళ్లీకొట్టు యజమాని సత్యనారాయణ గుర్తించాడు. స్థానికుల సహాయంతో సీతారామారావును పట్టుకుని అంగర పోలీసులకు అప్పగించాడు. ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలపై నిందితుడిని సీఐ దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ విచారించారు. అతడి సమాచారం మేరకు పోలీసులు విజయవాడకు చెందిన వారా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 44 నకిలీ రూ.500 నోట్లు, లాప్‌టాప్, పెన్ డ్రైవ్, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ దొరరాజు తెలిపారు.
ఉరి వేసుకుని
మహిళ ఆత్మహత్య
యానాం: పట్టణ పరిధిలోని న్యూరాజీవ్ నగర్‌కు చెందిన దంగుడుబియ్యం సత్యవతి (75) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారై ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్‌కు తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై పంపన మూర్తి తెలిపారు. ఏడాదిగా సత్యవతి మానసికస్థితి బాగోలేదని, మందులు వాడుతోందని స్థానికులు తెలిపారు.