మండపేట: జనావాసాల నడుమ మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై మండపేట మహిళలు మండిపడ్డారు. ఆ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వివరాలివీ.. మండపేట 28, 29, 30 వార్డులకు అనుసంధానంగా ఉన్న సత్యశ్రీ రోడ్డులో గతంలో మద్యం షాపును తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. దీనిపై స్థానికులు ఆందోళన చేయడంతో అప్పట్లో ఎకై ్సజ్ అధికారులు ఆ షాపును తొలగించారు. ఇప్పుడు అదే రోడ్డులో సప్తగిరి థియేటర్ ఎదురుగా శాశ్వతంగా మద్యం దుకాణం పెట్టేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మద్యం షాపులు పెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అది చాలదన్నట్లు కొత్తగా కల్లుగీత కార్మికుల కోటాలో వచ్చిన మద్యం దుకాణాన్ని జనావాసాల నడుమ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మండిపడుతున్న మహిళలు, స్థానికులు ఈ షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 50 మంది మహిళలు షాపు ఎదురుగా టెంట్ వేసి తొలి రోజు దీక్షల్లో కూర్చున్నారు. ‘మా ప్రాంతంలో మద్యం కొలిమి పెట్టొద్దని మూడు వార్డుల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూంటే పట్టించుకోకుండా దుకాణం పెడతారా?’ అంటూ వారు ఫైరయ్యారు. ఇది నిత్యం వందలాది మంది ప్రయాణించే రోడ్డు అని, ఈ ప్రాంతంలో మూడు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయని, సినిమాలకు వచ్చే ప్రేక్షకులతో ఈ మార్గం పగలు, రాత్రి రద్దీగా ఉంటుందని చెప్పారు. అలాగే, ఈ ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉన్నాయని, తెల్లవారితే విద్యార్థులు ఈ రోడ్డు వెంబడే పాఠశాలలకు వెళ్లాలని, నివాస ప్రాంతాలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ఇటువంటి చోట ఏవిధంగా మద్యం దుకాణం పెడతారో చెప్పాలని మహిళలు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అధికారులు మద్యం వ్యాపారులకు వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మద్యం షాపు తొలగించేంత వరకూ ఆందోళలన విరమించేది లేదని స్పష్టం చేశారు. రిలే దీక్షా శిబిరంలోని మహిళలతో సీఐ సురేష్ చర్చించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెళ్తుందని, శాంతియుతంగా నిరసన తెలపాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీక్షల్లో షేక్ అప్రోజ్, పోతుల కీర్తి, తోట పార్వతి, వనపర్తి మౌనిక, తోట కనక మహాలక్ష్మి, వాసంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఫ జనావాసాల్లో
మద్యం దుకాణంపై ఆగ్రహం
ఫ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం