సాక్షి, అమలాపురం: సముద్రం తీరం, నదీ గర్భాలను ధ్వంసం చేస్తూ పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చిన తీర్పు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంత ఆక్వా రైతుల్లో కొత్త ఆందోళనకు దారి తీస్తోంది. కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరం, గోదావరి లంకలు, ఏటిగట్లను ఆనుకుని వందల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చెరువుల మీద కూడా ఎన్‌జీటీ కత్తి వేలాడుతోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధికారికంగా 12 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కానీ, అనధికారికంగా ఇంతకు రెండు రెట్లు సాగవుతోంది. వెనామీ రొయ్యల సాగుకు అనుమతి పొందాలంటే పలు నిబంధనలున్నాయి. చప్పనీటి చెరువుల సాగు పేరుతో (చేపల సాగు) అనుమతులు తెచ్చుకుని పలువురు అనధికారికంగా ఉప్పునీటి సాగు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో అన్ని రకాల అనుమతులూ ఉన్న చెరువులు 10 శాతం కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇవి కాకుండా సీఆర్‌జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చెరువుల తవ్వకాలు పెద్ద ఎత్తున సాగాయి. గడచిన రెండున్నర దశాబ్దాల్లో అటు తీర ప్రాంతంలో శివారు ఏటిగట్లను, ఇటు గోదావరి ఏటిగట్లను ఆనుకుని ఆక్వా సాగు చేయడం పెను ప్రమాదానికి కారణమవుతోంది. రాజోలు దీవిలో సీఆర్‌జెడ్ పరిధిలో అనధికారికంగా సాగు జరుగుతున్న ప్రాంతాల పైనే ఆ ప్రాంత వాసులు ఎన్‌జీటీని ఆశ్రయించారు. అందువలన వాటిని తొలగించాలనే తీర్పు వచ్చింది. అయితే, ఇది మిగిలిన ప్రాంతాల్లో అక్రమంగా ఆక్వా సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమ మీద కూడా ఎన్‌జీటీ పిడుగు పడుతుందేమోనని వారు కలవరపడుతున్నారు.
గోదావరి గట్లను ఆనుకుని..
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరొందడానికి పావన జీవనది గోదావరే కారణం. అదే గోదావరి కన్నెర్ర చేసి వరదగా వచ్చి పడితే పెను విషాదాన్ని మిగులుస్తోంది. రక్షణగా ఉన్న ఏటిగట్లు తెగి పడి ఆస్తి, ప్రాణ నష్టాలు చోటు చేసుకున్న విషాద ఉదంతాలు పలు జరిగాయి. ఈ ముప్పును నివారించేందుకే ఏటిగట్లను పటిష్టపరచి, వాటికి రక్షణ కల్పిస్తూంటారు. బిటిష్ పాలనలోనే మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏటిగట్టు నుంచి నదీ గర్భంలో 100 నుంచి 150 మీటర్ల వరకూ ఎటువంటి తవ్వకాలూ చేయరాదు. నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు చేయకూడదు.
కానీ, ఉమ్మడి జిల్లాలో దీనిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఏటిగట్లను ఆనుకుని పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల, ఎదుర్లంక, గోగుల్లంక, భైరవలంక; కాట్రేనికోన మండలం చింతపల్లిలంక, నడవపల్లి, పల్లంకుర్రు, బలుసుతిప్ప; ముమ్మిడివరం మండలం అన్నంపల్లి, లంకాఫ్ ఠాణేలంక; పి.గన్నవరం మండలం పి.గన్నవరం, కె.ఏనుగుపల్లితో పాటు అయినవిల్లి మండలం, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక పరిధిలోని అరటికాయ లంకల్లో సహితం ఏటిగట్లను ఆనుకుని అక్రమ చెరువులు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. దీనివల్ల గట్ల ఉనికి ప్రమాదకరంగా మారింది. అలాగే లంకల్లో చెరువు చుట్టూ వేస్తున్న గట్ల వలన ప్రవాహ దిశ మారి కూడా ఏటిగట్లు దెబ్బ తింటున్నాయి. దీనివలన వరదల సమయంలో గండ్లు పడే ప్రమాదం పొంచి ఉంది.
మడ అడవుల ధ్వంసం
ఉమ్మడి జిల్లాలో మడ అడవులు విస్తారంగా ఉన్నాయి. తుపాన్లు, సునామీ వంటి విపత్తుల నుంచి ఇవి తీర ప్రాంతానికి ఎంతో రక్షణ కల్పిస్తాయి. అంతే కాదు.. సముద్రం ముందుకు చొచ్చుకుని రావడం వలన పెరుగుతున్న కోత నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నాయి. తాళ్లరేవు మండలం కోరంగి, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో అధిక సాంద్రతతో ఉన్న ఇటువంటి మడ అడవులను కూడా తొలగించి మరీ ఆక్వా చెరువులు తవ్వేశారు. కోరంగి అభయారణ్యంలో వందల ఎకరాల్లో మడ అడవులు ధ్వంసమయ్యాయి. అల్లవరం మండలం నక్కా రామేశ్వరం; ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, వాసాలతిప్ప; కాట్రేనికోన మండలం పల్లం, నీళ్లరేవు, చిర్రయానాం, కొత్తపాలెం లైట్ హౌస్ వరకూ చెరువులు తవ్వి పీతలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఈ చెరువులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ.. అధికారులు కళ్లు మూసుకోవడంతో ఈ చెరువులకు ప్రభుత్వం నుంచి రాయితీలు, బ్యాంకుల నుంచి రుణాలు, ఉచిత విద్యుత్ వంటివి అందుతున్నాయి. దీంతో అక్రమ ఆక్వా సాగుకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీనికి ఎన్‌జీటీ రూపంలోనైనా కళ్లెం పడితే తీర ప్రాంతానికి మేలు జరుగుతుందని ప్రకృతి ప్రేమికులు ఆశిస్తున్నారు.
ఫ ఉమ్మడి జిల్లాలో తీరం పొడవునా అక్రమ ఆక్వా సాగు
ఫ సీఆర్‌జెడ్ నిబంధనలకు అడుగడుగునా తూట్లు
ఫ ఇసుక దిబ్బలు, సర్వే తోటలు, మడ అడవులు తొలగించి మరీ సాగు
ఫ నదీ గర్భంలో సైతం దందా
ఫ రాజోలు దీవిపై మాత్రమే
ఎన్‌జీటీకి ఫిర్యాదు
ఫ మిగిలినచోట్ల యథాతథంగా సాగు
సముద్ర తీరాన్ని ఆనుకుని..
కాకినాడ జిల్లా తొండంగి నుంచి కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం వరకూ తీరం పొడవునా ఆక్వా చెరువులున్నాయంటే అతిశయోక్తి కాదు. సముద్ర తీరాన్ని ఆనుకుని గతంలో పెద్ద ఎత్తున వరి, సరుగుడు, కొబ్బరి సాగు జరిగేది. తరువాత కాలంలో వీటిని తొలగించి ఆక్వా చెరువులు తవ్వారు. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరిగిరపట్నం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, సఖినేటిపల్లి మండలం అంతర్వేది, మలికిపురం మండలం కేశనపల్లి వంటి ప్రాంతాల్లో నేరుగా సముద్రం నుంచి ఆక్వా చెరువుల్లోకి ఉప్పు నీరు తోడుతున్నారు. దీనినిబట్టి సముద్ర తీరంలో అక్రమ చెరువుల తవ్వకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చెరువులతో పాటు రొయ్యల సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీలు సైతం సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని అంచనా.
అక్కడ సరే... మరిక్కడ..!
అక్కడ సరే... మరిక్కడ..!
అక్కడ సరే... మరిక్కడ..!