ఈదరపల్లి నూతన వంతెన నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఈదరపల్లి నూతన వంతెన నిర్మాణం

Mar 20 2025 12:08 AM | Updated on Mar 20 2025 12:07 AM

అమలాపురం రూరల్‌: జిల్లా కేంద్రమైన అమలాపురంలో ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించే దిశగా ఈదరపల్లి వద్ద నూతన వంతెన నిర్మాణాన్ని రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వంతెనకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, పట్టణవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ వంతెన నిర్మాణానికి తక్షణమే కలెక్టరేట్‌ నుంచి రూ.2 కోట్లు మంజూరు చేశామన్నారు. కోనసీమ జిల్లా కేంద్రంలో పురాతన వంతెనలు ట్రాఫిక్‌ రద్దీకి తగ్గట్టుగా లేని దృష్ట్యా వీటిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిష్‌ వారు నిర్మించిన వంతెనలపైనే రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వాహన కమ్యూనికేషన్లు, డేటా ట్రాన్స్‌మిషన్‌, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆర్డీఓ కె.మాధవి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, జల వనరుల శాఖ డీఈ బి.శ్రీనివాసరావు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్‌.రాజబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీవీఆర్‌ రాజు తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు.

త్వరితగతిన డ్రెడ్జింగ్‌ పూర్తి చేయాలి

ఉప్పలగుప్తం: కూనవరం మేజర్‌ డ్రెయిన్‌ డ్రెడ్జింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్‌.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని రాఘవులపేట నుంచి గచ్చకాయలపొర వరకు కూనవరం మేజర్‌ డ్రెయిన్‌లో జరుగుతున్న డ్రెడ్జింగ్‌ పనులను బుధవారం అధికారులతో కలసి కలెక్టర్‌ పడవలో ప్రయాణించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొలాలకు ముంపు బెడద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మేజర్‌ డ్రెయిన్‌ ఏటి గట్టును పటిష్టం చేసి, గట్లు దిగువకు జారిపోకుండా జియో టెక్స్‌టైల్‌ మ్యాట్లను, జియో సింథటిక్‌ పద్ధతిని వినియోగించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ప్రతిపాదనలు చేయాలని డ్రైనేజీ విభాగం ఇంజినీర్లకు సూచించారు. రాబోయే కాలంలో ఎన్‌.కొత్తపల్లి పంచాయతీ పరిధి రాఘవులపేట నుంచి గచ్చకాయలపొర వరకు ఏటిగట్టు మీదుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రెయిన్స్‌ ఈఈ ఎంవీవీ కిషోర్‌ మాట్లాడుతూ, రూ.3.5 కోట్ల నిధులతో రెండు కి.మీ. మేర డ్రెడ్జింగ్‌ పనులు చేపడుతున్నామన్నామని చెప్పారు. ఈ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయన్నారు. రెండు వైపులా ఏటిగట్టును పటిష్టం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, వర్షాకాలం సమయానికి 600 మీటర్ల మొగ ప్రాంతంలో పూర్తి స్థాయి తవ్వకాలు చేపడతామని వివరించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ వీఎస్‌ దివాకర్‌, డ్రెయిన్స్‌ ఏఈ కె.సునీతాదేవి ఉన్నారు.

ఈవీఎంలకు పటిష్ట భద్రత కల్పించాలి

ముమ్మిడివరం: ఈవీఎంలను భద్రపర్చిన గోదాములకు పటిష్ట భద్రత కల్పించాలని, పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ సూచించారు. బుధవారం ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మూడో అంతస్థులో ఈవీఎం, వీవీ ప్యాట్లను ఉంచిన గోదాముల వద్ద భద్రతను పరిశీలించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదాముల తాళాలు తీసి, ఈవీఎం, వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్ని నిరోధక పరికరాలను పరిశీలించారు. గోదాముల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఉంచాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌ఓ బీఎల్‌ఎన్‌ రాజకుమారి, తహసీల్దార్‌ యూ.సుబ్బలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్‌ శివరాజ్‌, పలువురు రాజకీయ ప్రతినిధులు ఉన్నారు.

రూ.2 కోట్ల అంచనాతో ప్రణాళిక

ఆక్రమణల తొలగింపునకు

అధికారులతో కమిటీ

జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement