
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
అమలాపురం రూరల్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదన్నారు. ఆయన పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన త్యాగ ఫలితంగా 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు ఆద్యులన్నారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు కృష్ణ కాంత్, శేఖర్ ప్రదీప్, జి.రాజు పాల్గొన్నారు.