
ప్లాస్టిక్ సంచుల వినియోగం వద్దు
అమలాపురం టౌన్: ప్లాస్టిక్ సంచులను వదిలేసి, జూట్, క్లాత్, పేపర్ సంచులు వినియోగిద్దామని జిల్లా ఇన్‌చార్జి అధికారి పి.రవిసుభాష్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు బజారును శనివారం ఆయన సందర్శించారు. ప్టాస్టిక్ సంచుల వినియోగాన్ని విడనాడాలని వినియోగదారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కూడా ప్లాస్టిక్ సంచుల నిషేధం గురించి వివరించారు. ఈ సందర్భంగా ‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్‌తో నిర్వహించిన స్వచ్ఛ దివస్ ర్యాలీని రవి సుభాష్, నిషాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మెయిన్ రోడ్డులో సాగింది. అనంతరం ‘పర్యావరణ పరిరక్షణకు పాటు పడతాం – ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని విరమిస్తాం’ అనే అంశంపై రైతు బజారులోని రైతులు, వినియోగదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అధికారులు చెప్పారు. రైతు బజారులోని దుకాణాలన్నింటికీ వెళ్లి, ప్లాస్టిక్ సంచులకు బదులు మట్టిలో కలిసిపోయే సంచులను మాత్రమే ప్రోత్సహించాలని సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన జూట్ సంచులను పరిశీలించి, అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, తహసీల్దార్ అశోక్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డాల గోపాలకృష్ణ, బొర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.