
గిరిపై భక్తజనసాగరం●
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి శనివారం భక్తజనసంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి వేలాదిగా వచ్చిన ఇతర భక్తులు కూడా తోడయ్యారు. వీరందరూ సత్యదేవుని దర్శించి, పూజలు, వ్రతాలు ఆచరించారు. దీంతో, ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు.
నేడు కూడా రద్దీ
సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు శనివారం రాత్రి కూడా వివాహ ముహూర్తాలున్నాయి. దీంతో, సత్యదేవుని సన్నిధిలో ఆదివారం రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు.
ఘనంగా ప్రాకార సేవ
సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉద యం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుచ్చి వాహనం మీద వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం అర్చకులు కొబ్బరి కాయ కొట్టి, ప్రాకార సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించి, స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.