
ఆ ‘పప్పు’లేం ఉడకవు
● కందిపప్పు సరఫరాలో కూటమి సర్కారుది ఆరంభ శూరత్వం
● రేషన్ దుకాణాల్లో పూర్తిగా నిలిపివేత
● మూడు నెలల నుంచి
బియ్యం, పంచదారతోనే సరి !
● ఉగాదికీ పప్పన్నం పెట్టలేని పాలకులు
ఆలమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిత్యావసరాలను రాయితీపై అందిస్తామంటూ నేటి పాలకులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ప్రజలందరూ నిజమేనని నమ్మారు కూడా. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైనా, ఇంకా అనేక పథకాలు ఆచరణకు నోచుకోలేదు. అమలులో ఉన్న పథకాలూ ఇప్పటికే అర్థంతరంగా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి నుంచి రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరాను నిలిపివేసి ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం కృషి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పును కూడా రాయితీపై అందిస్తామన్న హామీనీ అపహాస్యం చేసింది. రేషన్ డిపోల పర్యవేక్షణలో ఎండీయూ వాహనాలు ప్రస్తుతం బియ్యం, పంచదార పంపిణీకే పరిమితమయ్యాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంది పప్పును కేజీ రూ.67కే ప్రతి నెలా పంపిణీ చేస్తామని గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించింది.
ఈ నెలలో నిల్
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 30 శాతం మందికి మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఎండీయూ వాహనాల్లో ఈ ఏడాది మార్చి నెలలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అలాగే నిత్యావసర సరకుల ధరల నియంత్రణ కోసం సివిల్ సప్లయిస్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు దశలవారీగా మూతపడ్డాయి.
ప్రజలపై తీవ్ర ప్రభావం
రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అదుపు చేయలేకపోవడం ప్రజలకు పెనుశాపంగా పరిణమించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నగర పంచాయతీ, మూడు మున్సిపాలిటీల పరిధిలో 966 రేషన్ డిపోల ద్వారా 355 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల(ఎండీయూ)తో 5.48 లక్షల మందికి ప్రతి నెలా రేషన్ సరకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రతి నెలా 20లోపు సరకుల కోసం రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జిల్లా పౌర సరఫరాల శాఖ మాత్రం గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సక్రమంగానే ఎండీయూ వాహనాల ద్వారా కందిపప్పును సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలలకు కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా, 523 టన్నులకు గానూ కేవలం 112 టన్నులే సరఫరా చేసినట్టు డీలర్లు చెబుతున్నారు. డీడీల్లో మిగిలిన సొమ్మును ఇతర సరకులకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ రెండు నెలలు కూడా వినియోగదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా జరగలేదు.
పంపిణీకి బ్రేక్..!
రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో మార్చి నెల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ నెలలో కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా పూర్తి స్థాయిలో కందిపప్పు రాకపోవడంతో ఆసరాగా తీసుకున్న కొందరు రేషన్ సరకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలూ లేకపోలేదు. బియ్యం, పంచదారతో పాటు, కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే, నో స్టాక్ అనే సమాధానం వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పును అధికంగా రూ.150 వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
స్టాక్ కోసం
ఎదురుచూస్తున్నాం
జిల్లాలో రేషన్‌కార్డుదారులకు ఈ నెల కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. ఈ నెల కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు 18.27 మెట్రిక్ టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా జరిగింది. ప్రస్తుతం జిల్లా గోదాముల్లో కందిపప్పు నిల్వలు అందుబాటులో లేవు. పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు కందిపప్పు సరఫరాపై చర్యలు తీసుకుంటాం.
– ఎం.బాలసరస్వతి, జిల్లా మేనేజర్,
జిల్లా పౌర సరఫరాల సంస్థ, అమలాపురం

ఆ ‘పప్పు’లేం ఉడకవు