
అప్పులతో అమరావతి అభివృద్ధి సరే..
అమలాపురం టౌన్: శాసన సభ సమావేశాల సాక్షిగా మంత్రి నారాయణ వరల్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఏసియా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు రూ.48 వేల కోట్ల (అప్పు)తో రానున్న ఐదారు నెలల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు సరే.. మరి పర్యావరణం, ఉపాధి అవకాశాలను ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సూటిగా ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడారు. ఎక్కడైనా అభివృద్ధి పేరిట పనులు మొదలెడితే, ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుంది, కూలీలకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయి, ఇలాంటి అభివృద్ధి పేరిట ఉత్పన్నమయ్యే సమస్యలపై యునైటెడ్ నేషనల్ ఆర్గనైజన్స్(యూఎన్‌వో) ద్వారా ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ లాలో ఎన్నో దేశాల్లో కేసులున్నాయని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో భవిష్యత్తులో జరగనున్న పర్యావరణ, ఉపాధి అవకాశాలపై ఎదురయ్యే సమస్యలను ఛాలెంజ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అనుమతితో పార్టీ తరఫున ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ లాలో కేసు వేస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. యూఎన్‌వో చార్టర్ ప్రకారం రిహాబిలిటేషన్, రీ షెటిల్‌మెంట్ పరంగా అమరావతి అభివృద్ధి పేరిట అక్కడి కూలీలు, రైతులు, కార్మికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి మాటున జరగనున్న విధ్వంసాలపై పార్టీ తరఫునే కాకుండా, బీసీ సంఘాల తరఫున కూడా ఈ వైఫల్యాలను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్‌సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు వాసర్ల సుబ్బారావు, అనంత్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణం,
ఉపాధి అవకాశాల మాటేమిటి?
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ
సూర్యనారాయణరావు సూటి ప్రశ్న