క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు

May 25 2024 3:35 PM | Updated on May 25 2024 3:35 PM

క్రౌన

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల

ఫలితాలకు మరో పది రోజులు

ఓట్లు లెక్కించే శ్రీనివాస ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద కట్టుదిట్టంగా ఏర్పాట్లు

స్టాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత

కౌంటింగ్‌ సిబ్బందికి

రెండు దఫాలుగా శిక్షణ

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌..

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

సాక్షి అమలాపురం: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మరో పది రోజుల్లో తేలనుంది. కౌంటింగ్‌ జరిగే జూన్‌ 4వ తేదీ దగ్గర పడుతుండడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో తలమునకలైంది. పోలింగ్‌ సమయంలో పెద్దగా అవాంతరాలు, హింసాత్మక ఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం కౌంటింగ్‌ను కూడా అలాగే నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు అవసరమైన భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అమలాపురం లోక్‌సభ స్థానంతో పాటు అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్‌ ఒకేచోట జరగనుంది. కౌంటింగ్‌ జరిగే కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూముల వద్ద మూడంచెల భద్రత కల్పించి నిరంతరం పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కౌంటింగ్‌ రోజున మరింత భద్రత కల్పించనున్నారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ పలుమార్లు కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలు పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూములకు పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ సిబ్బందికి ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రెండు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఒక రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్షణలో సాగుతుంది. ఒక ఏఆర్వో, గెజిటెడ్‌ హోదా కలిగిన ఒక కౌంటింగ్‌ సూపరింటెండెంట్‌, ఒక సహాయకుడు, ఒక మైక్రో అబ్జర్వర్‌, ఈవీఎంలను అందజేసేందుకు ఇద్దరు వీఆర్వోలను నియమించారు. కౌంటింగ్‌ సిబ్బందిని 25 శాతం రిజర్వులో ఉంచారు. ప్రతి టేబుల్‌కు రౌండ్‌కు 500 ఓట్లు చొప్పున పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు.

184 టేబుళ్ల ఏర్పాటు

అసెంబ్లీ, పార్లమెంట్‌ కౌంటింగ్‌కు సంబంధించి 184 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్‌ను బట్టి అసెంబ్లీకి, పార్లమెంట్‌కు 10 నుంచి 14 వరకు టేబుళ్లు ఉంచనున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అసెంబ్లీకి 88 టేబుళ్లు, పార్లమెంట్‌కు 82 టేబుళ్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీస్‌ ఓటర్ల ఓట్ల లెక్కింపు సంబంధించి రెండు చొప్పున 14 టేబుళ్లు సిద్ధం చేస్తున్నారు.

భారీ భద్రత

కౌంటింగ్‌ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు పోలీసులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. సాయుధులైన సెంట్రల్‌ పారా మిలటరీ దళాలతోపాటు రెండో దశలో రాష్ట్ర ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బలగాలు, మూడో దశలో సివిల్‌ పోలీసులతో మూడంచెల భద్రత కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులో ఉంది. కౌంటింగ్‌ జరిగే శ్రీనివాస ఇంజినీరింగ్‌ కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాలను స్టైరెల్‌ జోన్‌గా ప్రకటించారు. కౌంటింగ్‌ కేంద్రం ప్రహరీ చుట్టూ వంద మీటర్ల వరకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. 214 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్దనే కాకుండా జిల్లాలో ఘర్షణలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. మాక్‌ డ్రిల్‌ నిర్వహించడం ద్వారా ఘర్షణలను ఎదుర్కొనేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

ఉదయం ఏడు గంటల నుంచి మొదలు

కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు మొదలు కానుంది. స్ట్రాంగ్‌రూమ్‌లను కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో తెరవనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. గతంలో తొలుత పోస్టల్‌ ఓటింగ్‌ మొదలయ్యేది. కాని ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీస్‌ ఓట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు సమాంతరంగా ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల కమిషన్‌ ప్రయోగాత్మకంగా సర్వీస్‌ ఓట్లు, హోమ్‌ ఓటింగ్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఓట్లను కూడా పోస్టల్‌, ఈవీఎం ఓట్లతో పాటు సమాంతరంగా లెక్కించనున్నారు.

హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం

ముమ్మిడివరం: చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలలో హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేశామని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హిమాన్షుశుక్లా తెలిపారు. ఆయన శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాలలోకి ప్రవేశించే మార్గాలను, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం, 360 డిగ్రీల పరిధిలో సీసీ కెమెరాల అమరిక, పోటీలో ఉన్న అభ్యర్థులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు సౌకర్యాలు, మరుగుదొడ్ల ఏర్పాట్లు, తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేచ్ఛాయుత వాతవరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి పూర్తి వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్ధుల ఏజెంట్ల సౌకర్యార్థం 20 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సురేష్‌బాబును ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ఈఈ రవికుమార్‌ను సూచించారు. హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ ఏర్పాటు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంజినీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ శ్రీధర్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.చంటిబాబు పాల్గొన్నారు.

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు1
1/3

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు2
2/3

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు3
3/3

క్రౌన్‌టింగ్‌కు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement