సైబర్‌ క్రిమినల్స్‌ కేరాఫ్‌ రాజస్తాన్‌

Cyber Crimes In Hyderabad Most Of The Fraudsters From Rajasthan - Sakshi

ఆర్థిక సైబర్‌ నేరగాళ్లలో అత్యధికులు అక్కడి వారే 

ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్‌ ద్వారా ఎరవేసి బురిడీ 

గత ఏడాది మొత్తం 344 మందిని అరెస్టు చేసిన సైబర్‌ కాప్స్‌ 

వీరిలో 50 మంది రాజస్తాన్‌వారే 

రాజస్తాన్‌ రాష్ట్రం సైబర్‌ నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్‌ కాప్స్‌ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్‌ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్‌ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు.  

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్‌ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్‌ఫోన్లను వినియోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు.  

అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు 
సైబర్‌ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 20 వరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్‌ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్‌ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్‌ చేయించుకుంటున్నారు. న్యూడ్‌ కాల్స్‌ చేయించి బ్లాక్‌ మెయిల్‌ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్‌ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు.   

నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో...  
పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్‌ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు.  

ఓటీపీలతో జార్ఖండ్‌ నేరగాళ్ల టోపీ 
బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్‌/క్రెడిట్‌ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్‌ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్‌ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తార యువత ఇప్పుడు ‘కాల్‌ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్‌ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top