జొమాటో కొత్త  ఫీచర్‌, దయచేసి మిస్‌ యూజ్‌ చేయకండి!

Zomato Covid emergency feature, but dont misuse Details here - Sakshi

క‌రోనా విజంభిస్తున్న తరుణంలో జొమాటో కీలక నిర్ణయం

 కోవిడ్‌ ఎమ‌ర్జెన్సీ ఫీచ‌ర్‌

సాక్షి,న్యూఢిల్లీ:  కరోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌ముఖ ఫుడ్‌  డెలివ‌రీ యాప్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. జోమాటో తన యాప్‌లో ‘కోవిడ్ ఎమర్జెన్సీలకు ప్రాధాన్యత డెలివరీ’ ఫీచర్‌ను  లాంచ్‌ చేసింది. దీని ద్వారా కోవిడ్‌-19  రోగులకు వేగంగా ఫుడ్‌ను డెలివరీ చేయనుంది. జొమాటోలో మనం ఫుడ్‌ ఆర్డర్‌ చేసినపుడు కోవిడ్-19 ఎమ‌ర్జెన్సీ మార్క్‌ టిక్‌ చేసిన ఆర్డర్‌లను  ప్రాధాన్యతతా ప్రాతిపదికన త్వరగా డెలివరీ ఇస్తుంది. లొకేష‌న్‌, రూట్ ఆధారంగా అక్క‌డ ఉన్న వేగ‌వంత‌మైన రైడ‌ర్‌కు ఈ డెలివ‌రీని అప్ప‌గిస్తుంది. అన్ని డెలివరీలు కాంటాక్ట్‌లెస్‌గా ఉంటాయని కూడా భరోసా ఇచ్చింది. ఈ ప్రత్యేక డెలివరీలకు అదనపు ఛార్జీలు ఉండవు. అంతేకాదు ఈ ఆర్డ‌ర్‌ల కోసమే ప్ర‌త్యేకంగా క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఫీచ‌ర్ ఆపిల్ ఐఫోన్‌తో పాటు, ఆండ్రాయిడ్ వినియోగదారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు జొమాటో తన కసమర్లందరికి ఈమెయిల్‌  సమాచారాన్ని కూడా అందించింది.  (వ్యాక్సిన్‌ తరువాత పాజిటివ్‌ : ఐసీఎంఆర్‌ సంచలన రిపోర్టు)

జోమాటో అప్లికేషన్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేసిన విషయాన్ని జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ బుధవారం రాత్రి ట్విటర్‌లో షేర్‌ చేశారు.  వేలాది మంది తమ రెస్టారెంట్ భాగస్వాములతో పాటు,  జోమాటో యాప్‌లో  'కోవిడ్ అత్యవసర పరిస్థితులకు ప్రాధాన్యత డెలివరీ'  ఫీచర్‌ తీసుకొచ్చామన్నారు. తమ కస్టమర్లకు సేవ చేసేందుకు తమతో  భాగస్వాములైన రెస్టారెంట్లకు ధన్యవాదాలు తెలుపుతూ  గోయల్ ట్వీట్‌ చేశారు.  ఈ ఎమ‌ర్జెన్సీ ఆర్డ‌ర్ల‌న్నీ కాంటాక్ట్‌లెస్‌గా ఉంటాయి.  డెలివ‌రీలను కస్టమర్ల ఇంటి గుమ్మం ముందు ఉంచి వెళ్తారు. ఈ ఎమ‌ర్జెన్సీ ఆర్డ‌ర్‌ల‌కు అంగీకరించిన రెస్టారెంట్‌ల లిస్ట్‌ను యాప్‌లో అప్‌డేట్ చేశారు. ఆర్డ‌ర్ పేజీలో ‘దిస్ ఆర్డ‌ర్ ఈజ్ రిలేటెడ్ టు ఎ కొవిడ్‌-19 ఎమ‌ర్జెన్సీ’ ఆప్ష‌న్‌ను యూజ‌ర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆర్డ‌ర్ తొంద‌ర‌గా వ‌స్తుంది క‌దా అని ఈ ఫీచర్‌ ను మిస్‌ యూజ్‌ చేయొద్దని జొమాటో  విజ్ఞప్తి చేసింది. అవ‌స‌రం లేని వాళ్లు కూడా కోవిడ్ ఎమ‌ర్జెన్సీ ఆర్డ‌ర్ చేస్తే నిజమైన లబ్దిదారులకు అన్యాయం జ‌రుగుతుంద‌ని  పేర్కొంది. దీనిని ఒక అంబులెన్స్‌ సేవలాగా పరిగణించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయొద్ద‌ని జొమాటో కోరుతోంది. గతంలో కరోనా విస్తరణ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్‌ డెలివరీ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. కానీ తాజా పరిస్థితుల్లో కోవిడ్‌ రోగులను ఆదుకునేందుకు  జొమాటో  చొరవ  పలువురి ప్రశంసలందుకుంటోంది.

కాగా శరవేగంగా వ్యాప్తిస్తున్న కోవిడ్-19 కేసులు, ఆక్సిజన్‌ కొరత, మందులు, బెడ్లు దొరకక కరోనా బాధితుల బాధలు వర్ణనాతీతం. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం అందించిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో కనీసం 3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top