
అది ఎంతో దూరంలో లేదు
తదుపరి దశ సెమీకండక్టర్ మిషన్ రెడీ..
చిప్స్.. డిజిటల్ డైమండ్స్
సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన ఓ చిన్న చిప్ ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకొస్తుందని, అది ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారత్‌లో రూపుదిద్దుకుని, భారత్‌లో తయారైందంటూ ప్రపంచమంతా మర్మోగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
18 బిలియన్ డాలర్ల విలువ చేసే 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయంటూ.. తదుపరి దశ భారత సెమీకండక్టర్ మిషన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ నిపుణులు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువ శక్తి, ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు. భారత్‌తో కలసి సెమీకండక్టర్ భవిష్యత్ నిర్మాణానికి ప్రపంచం
సుముఖంగా ఉన్నట్టు చెప్పారు.
డిజిటల్ డైమండ్స్...
చిప్‌లపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయిల్ అన్నది నల్ల బంగారం. కానీ చిప్‌లు అన్నవి డిజిటల్ వజ్రాలు’’అని పేర్కొన్నారు. చమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా, 21వ శతాబ్దాన్ని చిన్న చిప్‌లు నడిపించనున్నట్టు చెప్పారు. పరిమాణంలోనే చిన్నవే అయినా ప్రపంచ పురోగతిని వేగవంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. నోయిడా, బెంగళూరులో ఏర్పాటు చేసిన డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యాధునికమైన చిప్‌ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని, అవి బిలియన్ల లావాదేవీలను నిల్వ చేయగలవన్నారు.
‘‘ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 600 బిలియన్ డాలర్లుగా ఉంటే, రానున్న సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోతగ్గ వాటాను సొంతం చేసుకుంటుంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద హృదయంతో ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించారు. భారత విధానాలు స్వల్పకాలం కోసం కాదంటూ ప్రతి ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.
సెమీకండక్టర్ రంగంలో వేగం ముఖ్యమంటూ.. దరఖాస్తు నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం వరకు పేపర్ పని తక్కువగా ఉంటే వేఫర్ తయారీ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణితో పనిచేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నట్టు చెప్పారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్క్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
భూమి, విద్యుత్, పోర్ట్, ఎయిర్‌పోర్ట్‌లతో అనుసంధానత, నిపుణులైన మానవవనరులు ఇలా అన్ని అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వీటితో పారిశ్రామికవృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సీజీ పవర్‌కు చెందిన సెమీకండక్టర్ పైలట్ ప్లాంట్ ఆగస్ట్ 28న కార్యకలాపాలు మొదలు పెట్టిందని, కేనెస్ టెక్నాలజీ ప్లాంట్ పైలట్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే తయారీ కార్యకలాపాలు మొదలు పెట్టాయని, వాణిజ్య చిప్ ఉత్పత్తి ఈ ఏడాదే మొదలవుతుందని ప్రధాని ప్రకటించారు.
విక్రమ్.. తొలి మేడిన్ ఇండియా చిప్
భారత్‌లో రూపుదిద్దుకుని, ఇక్కడే తయారైన విక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్‌తో పాటు ఇతర టెస్ట్ చిప్‌లను ప్రధాని మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఇదే కార్యక్రమంలో అందజేశారు. ఈ తొలి మేడిన్ ఇండియా చిప్ విక్రమ్‌ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. కఠినమైన ఉపగ్రహ ప్రయోగ పరిస్థితుల్లోనూ వినియోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్‌వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.