దేశ‌ ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాలి | Uday Kotak: Need to reduce our dependence on foreign funds | Sakshi
Sakshi News home page

విదేశీ నిధులపై ఆధారపడటం తగ్గించుకోవాలి

May 13 2026 8:22 PM | Updated on May 13 2026 8:22 PM

Uday Kotak: Need to reduce our dependence on foreign funds

సీఐఐ కార్యక్రమంలో ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దీర్ఘకాలంలో రిసు్కలను ఎదుర్కొనేలా దేశీయంగా ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ తెలిపారు. నిధులు, అధికారం కోసం మరొకరిపై ఆధారపడకపోవడమే సిసలైన స్వావలంబన అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్‌ అనేక సంవత్సరాలపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపైనే (ఎఫ్‌పీఐ) ఆధారపడిందని, కరోనా మహమ్మారి తర్వాతే దేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే ధోరణి పెరిగిందని కోటక్‌ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా దేశీయంగా ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు త్రైమాసిక ఫలితాలు, షేర్ల ధరల్లాంటి స్వల్పకాలిక అంశాలపై కాకుండా దీర్ఘకాలికంగా సంస్థను తీర్చిదిద్దుకునే వ్యూహాలపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.

కంపెనీలు తమకొచ్చే లాభాలను తిరిగి వ్యాపారంలో ఇన్వెస్ట్‌ చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతమిస్తున్న ట్యాక్స్‌ ఇన్సెంటివ్స్‌కే పరిమితం కాకుండా అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలిస్తే కొత్తగా పెట్టుబడులకు ఊతం లభించగలదని కోటక్‌ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ద్వారా భారత్‌ తన బ్యాలెన్స్‌ షీట్‌ను పటిష్టం చేసుకోవచ్చన్నారు.  

పరిశ్రమలకు మేల్కొలుపు: మంత్రి పీయుష్‌ గోయల్‌ 
ప్రస్తుత పరిస్థితులు దేశీ పరిశ్రమలకు మేల్కొలుపులాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా దిగుమతులను తగ్గించుకునేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకునేందుకు దీన్నొక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, ఈ సంక్షోభ పరిస్థితుల్లో మిగతా దేశాలకన్నా మెరుగ్గా రాణించేందుకు భారత్‌ ముందు చక్కని అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు విదేశీ విహార యాత్రలపరమైన వినియోగాన్నే మాత్రమే తగ్గించుకోమని ప్రధాని చెప్పారే తప్ప వ్యాపార పర్యటనలను నిలిపివేసుకోవాలనలేదని గోయల్‌ తెలిపారు. ‘వ్యాపారాన్ని విస్తరించేందుకు పరిశ్రమ వర్గాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలి. మరింతగా విదేశీ మారకం వచ్చేలా మరిన్ని ఎగుమతి ఆర్డర్లను దక్కించుకోవాలి. కొంత ఖర్చు చేసి మరింతగా ఆదాయాన్ని పెంచుకోవాలి. మనం 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి‘ అని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement