3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన | Techie works 3 hours earns Rs 40 LPA parents fear Is He Doing Something Illegal | Sakshi
Sakshi News home page

3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన

Mar 25 2026 9:07 PM | Updated on Mar 25 2026 9:14 PM

Techie works 3 hours earns Rs 40 LPA parents fear Is He Doing Something Illegal

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్‌లో రిమోట్‌గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!

రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్‌ తన మేనల్లుడి గురించి లింక్డ్‌ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్‌టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

"వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్‌తో పంచుకున్నారు.

కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?
సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్‌లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్‌ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.

పని తీరును మార్చిన ఏఐ
2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.

బిజీగా ఉన్నట్లు నటన!
చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్‌ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement