Systematic Investments Plan in India: షేర్లు ‘సిప్‌’ చేస్తారా? ఇదుగో మీకు కావాల్సిన సమాచారం

SIP Mutual Fund: Details of Systematic Investments Plan in India - Sakshi

ప్రతి నెలా కావాల్సినన్ని షేర్లు కొనుగోలు

ఇన్వెస్టర్‌ ప్రమేయం అక్కర్లేదు

ట్రేడింగ్‌ ఖాతా నుంచే ఈ ఏర్పాటు

స్టాక్స్‌ గురించి తెలిసిన వారికే అనుకూలం

కొత్త ఇన్వెస్టర్లకు సూచనీయం కాదు

ఇందులో రిస్క్‌ పాళ్లు ఎక్కువ తెలియనప్పుడు ఫండ్స్‌లో సిప్‌ బెటర్‌  

మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) గురించి తెలుసు. వారం/పక్షం/మాసం లేదా త్రైమాసికం.. వీటిల్లో ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. ఇదే సిప్‌ను నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకూ సాధనంగా వినియోగించుకోవచ్చు.

ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్నన్ని షేర్లను నిర్ణీత కాలానికోసారి ఆటోమేటిగ్గా కొనుగోలు చేసుకునే సిప్‌ సదుపాయాన్ని స్టాక్‌ బ్రోకర్లు ఆఫర్‌ చేస్తున్నారు. అయితే, ఇది అందరికీ కాదు.. ఈక్విటీల పట్ల లోతైన
అవగాహన, రిస్క్‌లు తెలిసిన వారికే. లేదంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గమే బెటర్‌.  

నేడు సమాచార వ్యాప్తి విస్తృతి కారణంగా గతంతో పోలిస్తే సిప్‌కు ఎంతో ఆదరణ పెరిగింది. ప్రతి నెలా రూ.11,000 కోట్లకు పైనే సిప్‌ రూపంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో రూ.1,000 ప్రతి నెలా సిప్‌గా నిర్ణయించుకుంటే.. నిర్ణీత రోజున ఆ మొత్తం ఆ పథకంలో పెట్టుబడిగా చేరిపోతుంది. అదే స్టాక్స్‌లో అయితే ఎంపిక చేసుకున్నన్ని షేర్లు సిప్‌ రూపంలో డీమ్యాట్‌ ఖాతాలోకి చేరిపోతాయి. ఇన్వెస్టర్‌ తరఫున స్టాక్‌ బ్రోకర్లు ఈ సేవను ఆఫర్‌ చేస్తున్నారు. ప్రతి నెలా ఏ తేదీన, ఏ కంపెనీ షేర్లను ఎన్ని కొనుగోలు చేయాలన్నది ఇన్వెస్టర్లు చెబితే చాలు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అయితే ఎంత మొత్తం ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేయాలన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

సొంతంగా వేసుకునే సిప్‌ (డీఐవై సిప్‌)
ఏ షేర్లలో సిప్‌ చేసుకోవాలన్నది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవాలి. ఒక్క కంపెనీయే అని కాదు.. ఒకటికి మించిన స్టాక్స్‌లో సిప్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనివల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం నెలకొంటుంది. తద్వారా పెట్టుబడుల్లో రిస్క్‌ తగ్గించుకోవచ్చు. స్టాక్‌ సిప్‌లను కావాలనుకున్నప్పుడు నిలిపివేసు కోవచ్చు. లేదా రద్దు చేసుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుబడులకు ఇబ్బంది అనిపించినప్పుడు నిలిపివేసుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ట్రేడింగ్‌ ఖాతా నుంచే సిప్‌లో మార్పులు (మోడిఫై) చేసుకోవచ్చు. స్టాక్‌ను మార్చుకోవచ్చు. అలాగే, సిప్‌ రూపంలో కొనుగోలు చేయాల్సిన స్టాక్స్‌ సంఖ్యను కూడా మార్చుకోవచ్చు. కొందరు బ్రోకర్లు ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడయ్యే ఈటీఎఫ్‌ల్లోనూ సిప్‌ అవకాశాన్ని కల్పిస్తున్నారు.  

చార్జీలు నిల్‌...!
ఏ సేవ అయినా అందులో చార్జీలు ఉంటాయని తెలిసిం దే. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో యాక్టివ్‌ ఫం డ్స్‌ సాధారణంగా 2.5% వరకు ఎక్స్‌పెన్స్‌ రేషియో పేరిట చార్జ్‌ వసూలు చేస్తున్నాయి. అంటే ఏటా ఇన్వెస్టర్ల పెట్టుబడి వి లువ నుంచి ఈ మేరకు అవి మినహాయించుకుంటాయి. కానీ, స్టాక్‌ సిప్‌ విషయానికొస్తే ఎ క్కువ బ్రోకరేజీ సంస్థలు ప్రత్యేకంగా చార్జీలు తీసు కోవడం లేదు.

ఈక్విటీ డెలివరీగానే వాటిని చూస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డెలివరీ లావాదేవీలపై 0.5% బ్రోకరేజీ  వసూ లు చేస్తోంది. కొందరు బ్రోకర్లు అసలు డెలివరీకి ఎటువం టి చార్జీ తీసుకోవడం లేదు. జెరోదా, అప్‌స్టాక్స్‌ ఇవన్నీ డెలివరీకి జీరో బ్రోకరేజీ అమలు చేస్తున్నాయి. కనుక ఆయా సంస్థల్లో స్టాక్‌ సిప్‌ ఉచితమే. కాకపోతే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తరఫున లావాదేవీ చార్జీ స్వల్పంగా  0.00345 ఉంటుంది. దీనిపై 18% జీఎస్‌టీ ఉన్నా కానీ, ఈ చార్జీ చాలా కొద్ది మొత్తమే.

రిస్క్‌లు కూడా ఉన్నాయ్‌..
మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌లతో పోలిస్తే స్టాక్స్‌ సిప్‌తో రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నవి నిపుణుల ఆధ్వర్యంలో నడిచేవి. అవి ఏ ఒకటి, రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయవు. 25 నుంచి 75 స్టాక్స్‌ వరకు తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటాయి. పెట్టుబడుల పరిమాణాన్ని బట్టి స్టాక్స్‌ సంఖ్యను నిర్ణయిస్తుంటాయి.

అది కూడా భిన్న రంగాలకు చెందిన, బిన్న సైజు (లార్జ్, మిడ్, స్మాల్‌) కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ వైవిధ్యాన్ని పాటించగలవు. తద్వారా పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గిస్తాయి. కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్‌ నేరుగా సిప్‌ రూపంలో స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటే అది ఒకటి లేదా రెండు స్టాక్స్‌కు పరిమితం కావచ్చు. దీనివల్ల రిస్క్‌ అధిక పాళ్లలో ఉంటుంది.

సిప్‌ కోసం ఎంపిక చేసుకున్న రెండు కంపెనీల్లో ఒక కంపెనీలో ఏదైనా అక్రమాలు బయటపడితే.. వ్యాపార విధానంలో తేడా వచ్చి చతికిలపడితే అప్పుడు ఎదుర్కొనే రిస్క్‌ అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్నేళ్ల పాటు అలా సిప్‌ చేసుకుంటూ వెళితే.. మీ పెట్టుబడుల్లో అధిక భాగం అలా ఒకటి రెండు కంపెనీల్లోనే పోగుపడిపోతుంది.   మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు, పరిశోధన బృందం మార్కెట్‌ తీరు, పరిస్థితుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. భావోద్వేగ నిర్ణయాలకు సాధ్యమైనంత దూరంగా పనిచేస్తుంటారు. పెట్టుబడుల విధానాలు తెలిసి ఉంటారు.

ఎంతో లోతైన, విస్తృత అధ్యయనం చేసి, నమ్మకం కలిగితేకానీ ఒక కంపెనీలో ఎక్స్‌పోజర్‌ తీసుకోరు. కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విధమైన పరిశోధన, అధ్యయనం చేస్తారా? దాదాపు లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. స్టాక్‌ సిప్‌ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీ.. సమర్థవంతమైనది కాకపోతే నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది.

మార్కెట్ల గురించి తెలిసి, మంచి విజ్ఞానం ఉన్న వారికి స్టాక్‌ సిప్‌ అనుకూలిస్తుంది. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి.. రాబడులా లేక నష్టాలా అన్నది ముఖ్యంగా ఎంపికపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. అంత పరిజ్ఞానం ఉన్న వారికే స్టాక్‌సిప్‌. లేదంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ చేసుకోవడమే మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు అసలు స్టాక్‌ సిప్‌ గురించి ఆలోచించకపోవడమే మంచిది.  

ప్రయోజనం ఉందా..?
ఒక కంపెనీ స్టాక్‌ ధర ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. తగ్గుతూ పెరుగుతుండడం సాధారణం. సిప్‌ రూపంలో అయితే తగ్గినప్పుడు, పెరిగినప్పుడు పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకేసారి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు లేని ఇన్వెస్టర్లు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అటువంటి వారు సిప్‌ రూపంలో దీర్ఘకాలంలో నచ్చిన కంపెనీలో వాటాలను పోగు చేసుకోవచ్చు.

మార్కెట్లు దిద్దుబాటుకు లోనైనప్పుడే ఇన్వెస్ట్‌ చేయాలని వేచి చూసే అవస్థ, అయోమయానికి స్టాక్‌ సిప్‌ పరిష్కారం చూపుతుంది. ఎందుకంటే మార్కెట్లు పడినా, పెరిగినా సిప్‌ రూపంలో వాటిని కొనుగోలు చేస్తుంటారు కనుక ‘ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ (ఫోమో)’ను అధిగమించొచ్చు. ఫోమో అంటే ఒకవేళ వెంటనే కొనుగోలు చేయకపోతే ఆ స్టాక్‌ ధర పెరిగిపోతుందేమో, చేయి దాటిపోతుందేమో? అన్న ఆందోళన. ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ ఫోమో కారణంగానే స్టాక్స్‌ను గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి స్టాక్స్‌ పడిపోతుంటే భయంతో అమ్మి బయటపడదామని భావిస్తుంటారు. సిప్‌ అయితే ఈ తలనొప్పి ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top