
నేడు (17న) దేశీ స్టాక్ మార్కెట్లు గ్యాపప్‌తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 104 పాయింట్లు ఎగసి 11,290 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,186 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. శుక్రవారం లాక్‌డవున్ ఆందోళనలతో యూరోపియన్ మార్కెట్లు 0.7-1.6 శాతం మధ్య పతనంకాగా.. యూఎస్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో దాదాపు మార్కెట్లన్నీ లాభాలతో కదులుతున్నాయి. క్యూ2లో ఆర్థిక వ్యవస్థ వెనకడుగు వేయడంతో జపనీస్ నికాయ్ మాత్రమే నష్టాలతో ట్రేడవుతోంది. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
38,000 దిగువకు
వారాంతాన హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ బోర్లా పడ్డాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు కోల్పోయి 37,877 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. ఇక నిఫ్టీ 122 పాయింట్లు దిగజారి 11,178 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 38,540 వరకూ ఎగసింది. చివరి రెండు గంటల్లో అమ్మకాలు తలెత్తడంతో 37,655 దిగువకు పతనమైంది. ఇదే విధంగా నిఫ్టీ 11,366- 11,111 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,071 పాయింట్ల వద్ద, తదుపరి 10,964 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,326 పాయింట్ల వద్ద, ఆపై 11,473 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,314 పాయింట్ల వద్ద, తదుపరి 20,949 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,190 పాయింట్ల వద్ద, తదుపరి 22,700 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 46 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 797 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 416 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 764 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.