
పరిరక్షించకపోతే ఎంఎన్‌సీల నుంచి రైతులకు ముప్పు
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలని.. అంతర్జాతీయ కంపెనీలు అనుసరించే దోపిడీ విధానాల నుంచి భారత రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక సూచించింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నెలలో తదుపరి చర్చల కోసం అమెరికా బృందం భారత్‌ను సందర్శించాల్సి ఉంది.
‘‘బలమైన బహుళజాతి సంస్థలు భారత మార్కెట్లో సదుపాయాలు, వ్యవసాయ విలువ ఆధారిత ఉత్పత్తుల కల్పన, రైతుల సంక్షేమం, వారి శ్రేయస్సు దిశగా పెద్దగా పెట్టుబడులు పెట్టుకుండానే ఇక్కడి మార్కెట్ అవకాశాలను కొల్లగడతాయి. కనుక వీటి బారి నుంచి రైతుల ప్రయోజనాలను తప్పకుండా కాపాడాలి’’అని ఈ నివేదిక సూచించింది.
ఒత్తిడి పెంచుతున్న ట్రంప్...
బహుళజాతి సాగు సంస్థలు బడా మార్కెట్లలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండడాన్ని ప్రస్తావించింది. మొక్కజొన్న, సోయాబీన్, యాపిల్స్, బాదం, ఇథనాల్‌పై టారిఫ్‌లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వీటితోపాటు అమెరికా పాడి ఉత్పత్తులకు అవకాశాలు కలి్పంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో కేంద్ర సర్కారు అమెరికా డిమాండ్లను అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది.
రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడబోదని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం తేల్చి చెప్పారు. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ద్వారా యూఎస్‌కు స్పష్టమైన సంకేతం పంపారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే దిశగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు పెంచేయడం గమనార్హం.
ఇంధన బిల్లు పెరగొచ్చు..
ఒకవేళ అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి భారత్ నిలిపివేసినట్టయితే చమురు దిగుమతుల బిల్లు 9 బిలియన్ డాలర్లు మేర పెరుగుతుందని.. 2026–27లోనూ 11.7 బిలియన్ డాలర్లు అధికం కావొచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది.‘‘ అంతర్జాతీయ చమురు సరఫరాలో రష్యా 10 శాతం వాటా కలిగి ఉంది. అన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే, అదే సమయంలో మిగిలిన దేశాలు ఉత్పత్తిని పెంచకపోతే చమురు ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది’’అని ఈ నివేదిక పేర్కొంది.