మైక్రోఫైనాన్స్‌కు మహర్దశ! | RBI proposes to lift interest rate cap on microfinance institutions | Sakshi
Sakshi News home page

మైక్రోఫైనాన్స్‌కు మహర్దశ!

Jun 17 2021 6:56 AM | Updated on Jun 17 2021 7:56 AM

RBI proposes to lift interest rate cap on microfinance institutions - Sakshi

ముంబై: సూక్ష్మ రుణ విభాగం దేశంలో మరింత విస్తరించేందుకు వీలుగా రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. వేర్వేరు రుణ రేట్లు.. అంటే ఇప్పటి వరకు అనుసరిస్తున్న రుణ రేట్లను మరింత పెంచుకునే స్వేచ్ఛ.. నూతన ఉత్పత్తుల అభివృద్ధి ఇలా ఎన్నో ప్రణాళికలు ఆర్‌బీఐ అమ్ముల పొదిలో ఉన్నాయి. రుణ రేట్ల విషయంలో నియంత్రణలు తొలగించి అన్ని రకాల రుణ సంస్థలకూ ఓపెన్‌ ఆర్కిటెక్చర్‌ (కస్టమర్ల అవసరాలకు తగినట్టు ఉత్పత్తులను ఆఫర్‌ చేయడం)ను ఏర్పాటు చేయడంపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. దీంతో రుణ సంస్థలు కస్టమర్ల రిస్క్‌ ప్రొఫైల్‌ (తిరిగి చెల్లింపుల్లో సమస్య) ఆధారంగా అధిక రుణ రేట్లను వసూలు చేసుకునే వెసులుబాటు రానుంది. ‘‘రుణగ్రహీతల క్రెడిట్‌ రిస్క్‌ ఆధారంగా రేట్లలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇప్పటివరకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు)– సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐలు) రుణగ్రహీతల క్రెడిట్‌ రిస్క్‌ ఆధారంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు. ఇప్పుడిది సాధ్యం కానుంది’’ అని క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ఎండీ ఉదయ్‌కుమార్‌ హెబ్బార్‌ తెలిపారు. క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ సంస్థ దేశంలో అతిపెద్ద ఎంఎఫ్‌ఐ కావడం గమనార్హం.  

మరింత మందికి చేరువ..
సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణకు సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని ఇటీవలే ఆర్‌బీఐ విడుదల చేసింది. ఇందులో వినూత్నమైన ప్రతిపాదనలున్నాయి. రుణ రేట్లపై నియంత్రణలను తొలగించడం వల్ల దిగువ స్థాయిల్లోని రుణ గ్రహీతలకు సంబంధించి రుణ సంస్థలు వడ్డీ రేట్లను తగ్గిస్తాయని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ఇలా దిగువ వర్గంలోని రుణ గ్రహీతలు ప్రస్తుతం వార్షికంగా 20 శాతానికిపైనే వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తోంది. నిధులపై వ్యయాలు చాలా తక్కువగా ఉండే పెద్ద బ్యాంకులు సైతం చిన్న రుణ గ్రహీతల నుంచి 24 శాతం వరకు వడ్డీని రాబడుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రుణ రేట్ల విషయంలో స్వేచ్ఛను కల్పించడం వల్ల రిస్క్‌ ఉండే చోట అధిక రేట్లు, రిస్క్‌ తక్కువ ఉండే చోట తక్కువ రేట్లను సూక్ష్మ రుణాల్లోనూ అమలు చేసేందుకు వీలు పడుతుందని భావిస్తున్నాయి. ‘‘ప్రతిపాదిత ఆర్‌బీఐ కార్యాచరణతో సూక్ష్మరుణ మార్కెట్‌ వ్యాపార నిర్వహణ పరంగా మార్పును చూడనుంది. రిస్క్‌ ఆధారంగా.. భిన్న భౌగోళిక ప్రాంతాల్లో భిన్నమైన రుణ రేట్లను అమలు చేయవచ్చు. ఉదాహరణకు రుణ ఎగవేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక రేట్లు ఉండొచ్చు. అదే విధంగా అప్పటివరకు ఎటువంటి రుణ చరిత్ర లేని నూతన రుణ గ్రహీతల నుంచి ఎక్కువ రేటును వసూలు చేసుకోవడానికి ఉంటుంది. ఒక్కసారి వారికంటూ రుణ చరిత్ర ఏర్పాటైన తర్వాత ఆకర్షణీయమైన రేట్లకు రుణాలను ఆఫర్‌ చేయవచ్చు’’ అని అరోహణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ మనోజ్‌కుమార్‌ చెప్పారు.

మార్కెట్‌ విస్తరిస్తే మంచిది..
60% పైగా మార్కెట్‌ వాటా కలిగి ఉన్న బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచబోవని ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఎండీ నితిన్‌చుగ్‌ చెప్పారు. ‘‘రేట్లన్నవి మార్కెట్‌ ఆధారితమే. ఆర్‌బీఐ ప్రతిపాదనలకు తగ్గట్టు మార్కెట్‌ విస్తరించినట్టయితే నిర్ణీత కాలానికి వడ్డీ రేట్లు దిగిరావడానికి అవకాశం ఉంటుంది’’ అని చుగ్‌ వివరించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ నిబంధనల మేరకు.. ఒక రుణ గ్రహీతకు ఏవేనీ రెండు ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు మించి రుణాలు ఇవ్వకూడదు. అదే బ్యాంకులకు  ఇలాంటి నిర్బంధాలు లేవు. ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనలతో రుణ సంస్థలు మరిన్ని కొత్త ఉత్పత్తులను తెచ్చే అవకాశం ఉంటుందని  పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement