
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కావాలంటే ఇప్పటి నుంచే ఎంతో కొంత పొదుపు చేయడం చాలా అవసరం. పిల్లల చదువులు, ఇల్లు కొనడం, పెళ్లి ఖర్చులు లేదా రిటైర్మెంట్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇందు కోసం ప్రతిఒక్కరూ పొదుపు మార్గాలను అన్వేషిస్తారు. అయితే చాలా మంది రిస్క్ లేని కానీ లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తారు. అలాంటి ఇన్వెస్టర్లకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీమ్ మంచి ఎంపిక.
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ అంటే ఏమిటి?
పోస్టాఫీస్ ఆర్డీ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన పొదుపు పథకం. ఇది సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఇందులో మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కించి జమ చేస్తారు. దీంతో రాబడి వేగంగా వృద్ధి చెందుతుంది.
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్‌లో కనీస నెలవారీ డిపాజిట్ రూ.100. ఆపై మీరు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎటువంటి పరిమితి ఉండదు. కాల పరిమితి 5 ఏళ్లు. కావాలంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.
ఈ స్కీమ్‌కు ప్రస్తుతం 6.7% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. దీనిని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. జూలై-సెప్టెంబర్ 2025 కోసం 6.7% వార్షిక వడ్డీని నిర్ణయించింది.
ఆర్డీ పథకంలో మీరు జమ చేస్తున్న సొమ్ముపై అత్యవసర పరిస్థితుల్లో రుణ సదుపాయం కూడా ఉంటుంది. మీకు ఆకస్మిక ఆర్థిక అవసరం ఎదురైతే, మీరు ఒక సంవత్సరం తర్వాత మీ డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు రుణం తీసుకోవచ్చు. అయితే, ఈ రుణంపై మీ ఆర్డీ రేటు కంటే 2% ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
5 ఏళ్లలో రూ.7 లక్షలు పొందండిలా..
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్‌లో నెలకు రూ .10,000 డిపాజిట్ చేస్తే రూ.7 లక్షలు పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల పాటు నెలకు రూ .10,000 చొప్పున డిపాజిట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. 6.7% వార్షిక వడ్డీ (త్రైమాసిక చక్రవడ్డీ)తో మీ మెచ్యూరిటీ మొత్తం రూ.7,13,659 అవుతుంది. అంటే మీరు వడ్డీ రూపంలో రూ.1,13,659 పొందుతారు. అసలు, వడ్డీ మొత్తం సొమ్ము ఎలాంటి రిస్క్ లేకుండా చేతికందుతుంది.