‘నెవర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌ లో బ్యాంకింగ్‌ !

Nirmala Sitharaman promises never before like Union Budget - Sakshi

సవాళ్లపై ‘సీతమ్మ’ అడుగులు ఎటు? 

ఒకవైపు ఎన్‌పీఏల భారం...  

మరోవైపు మూలధన సమస్యలు

‘‘ఈ దఫా ఇంతకు ముందెన్నడూ చూడని (నెవర్‌ బిఫోర్‌) విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ఉండనుంది...’’ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసిన వ్యాఖ్య ఇది. దీనితో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2021–22  వార్షిక బడ్జెట్‌పై అన్ని రంగాలకు సంబంధించి ఉత్కంఠత నెలకొంది. ఎకానమీకీ            వెన్నెముకగా భావించే బ్యాంకింగ్‌లోనూ ప్రస్తుతం ఇదే విషయమై చర్చ మొదలైంది. మొండిబకాయిల భారం నుంచి మూలధన సమస్యల వరకూ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన బ్యాంకింగ్‌కు రానున్న బడ్జెట్‌లో ఎటువంటి స్థానం లభించనుందన్నదే ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం.  

మొండిబకాయిల తీవ్రత...
కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అంతర్జాతీయ రేటింగ్, బ్యాంకింగ్‌ సేవల దిగ్గజాలు పలు సానుకూల విశ్లేషణలు చేస్తున్నాయి. అయితే ప్రతికూలతల విషయానికి వచ్చే సరికి బ్యాంకింగ్‌ మొండిబకాయిల సమస్య ముందు వరుసలో ఉంటోంది. భారత్‌ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల  భారం తీవ్రతరం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్వయంగా ఇదే విషయాన్ని భారత్‌ బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ప్రస్తావించడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం.    ఎన్‌పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో  మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్‌ నాటికి 13.5 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ ఇటీవలే విడుదల చేసిన  ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) పేర్కొనడం గమనార్హం.  ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ‘మొండి’ భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది.

నిధుల కొరత...
తీవ్ర ఒత్తిడుల నేపథ్యంలో బ్యాంకింగ్‌ క్యాపిటల్‌ అడక్వెసీ రేషియో (సీఏఆర్‌) 2020 సెప్టెంబర్‌లో 15.6 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్‌ నాటికి కనీసం 14 శాతానికి పడిపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ.  పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ఇది 12.5 శాతానికైనా పడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వాటాదారులు ఎవ్వరూ ఎటువంటి మూలధనాన్ని అందించలేకపోతే 2021 సెప్టెంబర్‌ నాటికి నాలుగు బ్యాంకులు కనీస మూలధన స్థాయిని నిర్వహించడంలోసైతం విఫలమయ్యే అవకాశం ఉందని స్వయంగా ఆర్‌బీఐ నివేదిక పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.  పరిస్థితి తీవ్రంగా ఉంటే ఈ తరహా బ్యాంకుల సంఖ్య తొమ్మిదికి చేరవచ్చన్న అందోళనా ఉంది.  నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక డిపాజిట్లు పెరుగుతుండగా, రుణాలు తగ్గుతుండడం మరో సమస్య.

ఎన్‌బీఎఫ్‌సీల స్థితీ అంతంతే!
దేశంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ)ల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. రుణ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీలు ప్రధాన మధ్యవర్తిత్వ సంస్థలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే  గత కొంత కాలంగా ఇవి నిధుల లభ్యత, పాలనా, సాల్వెన్సీ (తీసుకున్న రుణాలు తీర్చే సామర్థ్యం) సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రానున్న బడ్జెట్‌లో ఈ ఒత్తిళ్లను తగ్గించే చర్యలు ఉంటాయని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.  ఆర్‌బీఐ నుంచి నేరుగా ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల మద్దతు అవసరమన్న వాదనా ఊపందుకోవడం లిక్విడిటీ సవాళ్లకు అద్దం పడుతోంది.   ‘బ్యాంకులు కనీసం 50 శాతం నిధులను చిన్న, మధ్య స్థాయి ఎన్‌బీఎఫీసీల్లో ఇన్వెస్ట్‌ చేయాలంటూ తీసుకొచ్చిన టీఎల్‌టీఆర్‌వో 2.0కు స్పందన తగిన విధంగా లేదన్న విమర్శ ఉంది. ఇక ఎన్‌బీఎఫ్‌సీ వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలు లక్ష్యంగా ఆర్‌బీఐ ఇటీవలే  నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది.

బడ్జెట్‌లో ఆశిస్తున్న దేమిటి?
బాసెల్‌ నిబంధనలు
బ్యాంకింగ్‌ మూలధనానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న బాసెల్‌ నిబంధనలను మరో మూడు సంవత్సరాలు పక్కకు పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకింగ్‌ నుంచి మరింత నిధుల లభ్యత సమకూరుతుందని విశ్లేషిస్తున్నారు.

క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ పొడిగింపు
చిన్న, లఘు మధ్య తరహా పరిశ్రమలు బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి  అత్యవసర రుణ లభ్యత పొందడానికి కీలకమైన పథకం ఇది. 100 శాతం రుణ హామీ కేంద్రం నుంచి బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు దీనివల్ల లభిస్తోంది. ఆర్థికవ్యవస్థలో కీలక విభాగాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్న ఈ స్కీమ్‌ను మార్చి 31 తరువాతా పొడిగించేట్లు బడ్జెట్‌లో చర్యలు ఉండాలి.

డిజిటలైజేషన్‌
భారత్‌ బ్యాంకింగ్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయి. బ్యాంకింగ్‌లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. డిజిటలైజేషన్‌ విధానాలు అనుసరించడం వల్ల  తమ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని, సత్వర సేవలు పొందడానికి ఇదే ఒక మార్గమని వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

మార్కెట్‌ నుంచి నిధులు
ఉద్దీపనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక లిక్విడిటీ మార్కెట్లకు ఊతం ఇస్తున్న నేపథ్యంలో, బ్యాంకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తగిన చర్యలు ఉండాలి. ప్రభుత్వ క్లిష్ల ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకింగ్‌కు తగిన ద్రవ్య లభ్యతకు ‘మార్కెట్‌ ద్వారా నిధుల’ సమీకరణ కీలకాంశం.  

మరింత మూలధనం
2019–20 వరకూ గడచిన 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.3,85,000 కోట్లను సమకూర్చింది. కరోనా సవాళ్లు, తీవ్ర మొండిబకాయిల సమస్య నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులకు మరింత మూలధన మద్దతు అవసరం. తక్షణం బ్యాంకింగ్‌కు మరో రూ.లక్ష కోట్ల మూలధనం అవసరం అవుతుందని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

ప్రైవేటీకరణ – విలీనాలు
కొత్త బడ్జెట్‌లో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనాల దిశగా చర్యలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి.  

సంస్కరణలకు పెద్దపీట
బ్యాంకింగ్‌ రంగంలో భారీ సంస్కరణల విషయానికి వచ్చే సరికి ప్రైవేటీకరణ, విలీనాలతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలతో ‘ఒక బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ’ (హోల్డింగ్‌ కంపెనీ) ఏర్పాటు ఆవశ్యకతపై చర్చ జరుగుతోంది. దీనితోపాటు పటిష్ట మూలధనంతో  కూడిన ఒక డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (డీఎఫ్‌ఐ) ఏర్పాటు అవసరం ఉందన్నది నిపుణుల విశ్లేషణ. తద్వారా జాతీయ మౌలికరంగ పథకం (ఎన్‌ఐపీ)అవసరాలు తీర తాయని వారు సూచిస్తున్నారు. ఎన్‌ఐపీ కింద గుర్తించిన ప్రాజెక్టుల అమలుకు 2020–25 నాటికి రూ.111 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top