
దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.
దుర్వినియోగం కట్టడి..
ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.

ఆర్థిక వ్యవస్థకూ నష్టం
ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.
👉ఇది చదివారా? ఆధార్ అప్‌డేట్ గడువు జూన్ 14 వరకే..
ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..
చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్
ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్‌ల మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.