ఎంఎస్ఎంఈ ఈసీఎల్‌జీఎస్‌ స్కీంతో ఎకానమీకి భారీ భరోసా!

MSME Credit Guarantee Scheme Saves Above 13 Lakhs Firms: SBI Research - Sakshi

ఈసీఎల్‌జీసీ వల్ల 13.5 లక్షల సంస్థలకు ప్రయోజనం

1.5 కోట్ల ఉద్యోగాలకు రక్షణ

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక    

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) ప్రయోజనాలకు సంబంధించి ఆవిష్కరించిన అత్యవసర రుణహామీ పథకం(ఈసీఎల్‌జీఎస్‌) వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. 

కోవిడ్‌-19 ప్రేరిత లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రంగాలకు, ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈలకు రుణాన్ని అందించడం ద్వారా వాటిని కష్టాల్లో నుంచి గట్టెక్కించడానికి మే 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో  అత్యవసర రుణహామీ పథకం ప్రధాన భాగంగా ఉంది. ఆయా అంశాలపై ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా సమీక్షాంశాలను పరిశీలిస్తే.. ఈసీఎల్‌జీఎస్‌ (పునర్‌వ్యవస్థీకరణ సహా) కారణంగా దాదాపు 13.5 లక్షల సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఖాతాలు ప్రయోజనం పొందాయి. ఇలాంటి ఖాతాల్లో దాదాపు 93.7 శాతం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ కేటగిరీలో ఉన్నాయి.  

మహమ్మారి కాలంలో రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఎంఎస్‌ఎంఈ రుణ ఖాతాలు మొండిబకాయిల్లోకి (ఎన్‌పీఏ) జారిపోకుండా రక్షణ పొందాయి. ఈ సంస్థలు మొండిబకాయిలుగా మారితే 1.5 కోట్ల కార్మికులు నిరుద్యోగులుగా మారేవారు. ఒక్కొక్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించింది. ఈ పథకం వల్ల లబ్ది పొందిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్‌ ఉంది. తరువాతి స్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. 

(చదవండి: Bitcoin: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్‌ ధర..!) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top