పరిశ్రమలు రయ్‌రయ్‌..!

Industrial production up 3.6per cent in Oct as manufacturing - Sakshi

పుంజుకున్న తయారీ

ఐఐపీ వరుసగా రెండో నెలా అప్‌

అక్టోబర్‌లో 3.6 శాతం వృద్ధి

ఎనిమిది నెలల గరిష్టం

విద్యుత్, కన్జూమర్‌ గూడ్స్‌ రంగాల తోడ్పాటు

న్యూఢిల్లీ: తయారీ, కన్జూమర్‌ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్‌లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్‌లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదు కాగా.. కరోనా వైరస్‌పరమైన పరిణామాల కారణంగా మార్చి నుంచి ఆగస్టు దాకా ప్రతికూల స్థాయిలోనే కొనసాగింది. సెప్టెంబర్‌లో స్వల్పంగా 0.5 శాతం పెరిగింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి 25న కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని రకాల కార్యకలాపాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో ఐఐపీ 17.5 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక విభాగాలవారీగా చూస్తే అక్టోబర్‌లో..

► తయారీ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్‌లో ఇది 5.7 శాతం క్షీణించింది. ఐఐపీలో తయారీ రంగానికి 77.6 శాతం వాటా ఉంటుంది.
► కన్జూమర్‌ గూడ్స్‌ విభాగం 17.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో ఇది 18.9 శాతం క్షీణించింది. కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. గత అక్టోబర్‌లో ఇది 3.3 శాతం క్షీణించింది.
► విద్యుదుత్పత్తి మెరుగ్గా 11.2% వృద్ధి చెందింది. మైనింగ్‌ రంగం 1.5% క్షీణించింది.  
► పెట్టుబడులకు కొలమానంగా నిల్చే భారీ యంత్రపరికరాల ఉత్పత్తి 3.3 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో క్షీణత 22.4 శాతం.
► ఇన్‌ఫ్రా/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం 7.8% వృద్ధి చెందింది. అయితే, ప్రైమరీ గూడ్స్‌ విభాగంలో 3.3% క్షీణత నమోదైంది.

ఇంకా బలహీనంగానే..
ఐఐపీ ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసినప్పటికీ.. అక్టోబర్‌ డేటా ఊహించిన దానికన్నా బలహీనంగానే కనిపిస్తోందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ పేర్కొన్నారు. ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ‘ఆశాభావంతోనే ఉన్నప్పటికీ ఎకానమీ పటిష్టంగా రికవరీ బాటలో ఉందని విశ్వసించడానికి మరి కొన్ని నెలలు వేచి చూడాల్సి రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే కొద్ది నెలలు వృద్ధి బాటలో ఉండి తర్వాత కుప్పకూలిన ఉదంతాలు ఉన్నాయి‘ అని నాయర్‌ పేర్కొన్నారు. మరోవైపు, ఐఐపీ గణాంకాలు సానుకూలంగా ఆశ్చర్యపర్చినప్పటికీ.. ఇదే ధోరణి కొనసాగకపోవచ్చని ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సంస్థ ఈడీ సుజన్‌ హజ్రా అభిప్రాయపడ్డారు. భారీ ఉద్దీపన, ప్రభుత్వ వ్యయాలు, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు, నిధుల లభ్యత మెరుగుపడటం, సానుకూల ఐఐపీ.. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు.. ఎకానమీ సత్వరం కోలుకోవడానికి తోడ్పడ్డాయని మిల్‌వుడ్‌ కేన్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు నిష్‌ భట్‌ పేర్కొన్నారు. పటిష్టమైన రికవరీ సుదీర్ఘకాలం కొనసాగగలదని అంచనా వేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top