నాడు జుకర్‌బర్గ్‌.. నేడు మన సూర్య | Indian-Origin Surya Midha Surpasses Mark Zuckerberg as Worlds Youngest Billionaire | Sakshi
Sakshi News home page

నాడు జుకర్‌బర్గ్‌.. నేడు మన సూర్య

Mar 21 2026 1:43 PM | Updated on Mar 21 2026 3:03 PM

Indian-Origin Surya Midha Surpasses Mark Zuckerberg as Worlds Youngest Billionaire

ఒకప్పుడు 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్' అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌. దాదాపు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును ఇప్పుడు ఒక భారత సంతతి యువకుడు తిరగరాశాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే అపర కుబేరుడిగా అవతరించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మన సూర్య మిధా.

18 ఏళ్ల రికార్డు బ్రేక్‌
గతంలో మార్క్ జుకర్‌బర్గ్‌ తన 23వ ఏట బిలియనీర్ హోదాను అందుకుని రికార్డు సృష్టించారు. అయితే, సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందే, అంటే 22 ఏళ్లకే 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18,000 కోట్లు) నెట్‌వర్త్‌తో జుకర్‌బర్గ్‌ను అధిగమించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ సూర్యనే!

విజయానికి బాట వేసిన 'మెర్కోర్'
సూర్య సాధించిన ఈ అసాధారణ విజయానికి మూలం ఆయన స్థాపించిన 'మెర్కోర్' అనే ఏఐ (AI) స్టార్టప్. 2023లో తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్‌లతో కలిసి ఆయన ఈ సంస్థను ప్రారంభించారు.

మెర్కోర్ అనేది ఒక కృత్రిమ మేధ (AI) ఆధారిత రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్. కంపెనీలకు కావాల్సిన సరైన ప్రతిభావంతులను గుర్తించేందుకు ఇది 'AI అవతార్‌'లను ఉపయోగిస్తుంది. దరఖాస్తుదారులను నేరుగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా నియామక ప్రక్రియను ఈ ప్లాట్‌ఫారమ్ సులభతరం చేస్తుంది.

2025 అక్టోబర్ లో జరిగిన 'సిరీస్-సి' ఫండింగ్‌లో ఈ సంస్థ ఏకంగా 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సంస్థలో బ్రెండన్ ఫుడీ సీఈవోగా, ఆదర్శ్ హిరేమత్ సీటీవోగా వ్యవహరిస్తుండగా, సూర్య మిధా బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఢిల్లీ టూ కాలిఫోర్నియా..
సూర్య మిధా మూలాలు భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మౌంటైన్ వ్యూలో జన్మించిన సూర్య, జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల అంశంపై విద్యనభ్యసించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువతో, స్నేహితులతో కలిసి ప్రారంభించిన స్టార్టప్ నేడు ఆయనను ప్రపంచ కుబేరుల జాబితాలో నిలబెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement