బ్యూటీ బ్రాండ్స్‌లోకి పెట్టుబడుల జోరు.. | India D2C beauty sector thrives with rising funding and market size | Sakshi
Sakshi News home page

బ్యూటీ బ్రాండ్స్‌లోకి పెట్టుబడుల జోరు..

Oct 5 2025 5:08 AM | Updated on Oct 5 2025 5:08 AM

India D2C beauty sector thrives with rising funding and market size

టాప్‌ డీ2సీ సంస్థల నిధుల సమీకరణ 7 శాతం అప్‌ 

2020తో పోలిస్తే 3 రెట్లు అధికం 

24 బిలియన్‌ డాలర్లుగా దేశీ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్‌

న్యూఢిల్లీ: గ్లోబల్‌ బ్రాండ్స్‌ భారత మార్కెట్లోకి విస్తరిస్తున్నప్పటికీ, దేశీ ఆన్‌లైన్‌ డైరెక్ట్‌–టు–కన్జూమర్‌ (డీ2సీ) సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. 20 అగ్రగామి డీ2సీ బ్రాండ్స్‌లోకి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది (జనవరి–సెప్టెంబర్‌ మధ్య కాలంలో) ఇన్వెస్ట్‌మెంట్స్‌ 7 శాతం పెరిగాయి. సుమారు 63.1 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 560 కోట్లు) పైగా వచ్చినట్లు బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ట్రాక్షన్‌ డేటాలో వెల్లడైంది. 

2020లో నమోదైన 21.6 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే పెట్టుబడులు సుమారు మూడు రెట్లు ఎగియడం గమనార్హం. ఫండింగ్‌ సమకూర్చుకున్న సంస్థల్లో షుగర్‌ కాస్మెటిక్స్, ఇన్నోవిస్ట్, ఫే బ్యూటీ, రెనీ కాస్మెటిక్స్‌లాంటివి ఉన్నాయి. బ్యూటీ కేటగిరీలో పెట్టే పెట్టుబడులపై సగటున 10 నుంచి 25 రెట్లు రాబడులు వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో మార్జిన్లు అధికంగా ఉండటం, మూలధనాన్ని సమర్ధంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రీమియం ఉత్పత్తులకి, వినియోగానికి గణనీయంగా డిమాండ్‌ నెలకొనడం ఈ కేటగిరీకి సానుకూలాంశమని, ఇతరత్రా మిగతా ఏ కేటగిరీల్లోనూ ఇలాంటి పరిస్థితి లేదని వివరించాయి.  

ఫాక్స్‌టేల్‌కి 30 మిలియన్‌ డాలర్లు.. 
ఆర్‌ఏఎస్‌ లగ్జరీ స్కిన్‌కేర్‌ సంస్థ ఈ ఏడాది యూనిలీవర్‌ వెంచర్స్‌ నుంచి 5 మిలియన్‌ డాలర్లు, ఆయుర్వేదిక్‌ బ్యూటీ బ్రాండ్‌ ఇండి వైల్డ్‌ కూడా దాదాపు అంతే మొత్తాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులోనూ యూనిలీవర్‌ వెంచర్స్‌ సారథ్యంలోని ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో కార్యకలాపాల విస్తరణ కోసం కంపెనీ ఈ నిధులను సమకూర్చుకుంది. ఇక ఆగస్టులో రెనీ కాస్మెటిక్స్‌ సంస్థ సిరీస్‌ సీ విడత కింద ప్లేబుక్, మిడాస్‌ పార్ట్‌నర్స్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి 5.8 మిలియన్‌ డాలర్లు సేకరించింది. ఇక ఫాక్స్‌టేల్‌ సైతం సిరీస్‌ సీ విడత కింద పాంథెరా, కోసీ కార్పొరేషన్‌ తదితర సంస్థల నుంచి ఏకంగా 30 మిలియన్‌ డాలర్లు దక్కించుకుంది. అటు బేర్‌ అనాటమీ, కెమిస్ట్‌ ఎట్‌ ప్లే, సన్‌సూ్కప్‌లాంటి బ్రాండ్స్‌ మాతృ సంస్థ ఇన్నోవిస్ట్‌ సైతం ఐసీఐసీఐ వెంచర్, మిరాబిలిస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ నుంచి 16 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకుంది.  

45 బిలియన్‌ డాలర్లకు చేరనున్న పరిశ్రమ .. 
2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల మార్కెట్‌ పరిమాణం సుమారు 24 బిలియన్‌ డాలర్లుగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2030 నాటికి ఇది 40–45 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ మార్కెట్లో ఆన్‌లైన్‌ కేటగిరీ వాటా 2023లో 13 శాతంగా ఉండగా 2024లో దాదాపు 17 శాతానికి పెరిగినట్లు వివరించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలో ఈ–కామర్స్‌ బూమ్‌ నెలకొనడంతో కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపాయి. 

దీంతో వేగంగా వృద్ధి సాధించేందుకు, విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందించేందుకు, మార్కెట్లో మరింత విస్తరించేందుకు దేశీ బ్యూటీ బ్రాండ్స్‌ నిధులను సమకూర్చుకుంటున్నట్లు ట్రాక్షన్‌ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బడా కంపెనీలు, ఇలాంటి బ్యూటీ బ్రాండ్స్‌ను కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉంటున్నాయి. దేశీ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ మినిమలిస్ట్‌లో హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) 90.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 2,706 కోట్లు వెచి్చంచింది. అటు మారికో సంస్థ దాదాపు రూ. 400 కోట్లతో బియర్డోను కొనుగోలు చేసింది. ది మ్యాన్‌ కంపెనీని ఇమామీ దక్కించుకుంది.  

గ్లోబల్‌ బ్రాండ్స్‌ వెల్లువ.. 
దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లోకి పలు అంతర్జాతీయ బ్రాండ్స్‌ కూడా పెద్ద ఎత్తున ఎంట్రీ ఇస్తున్నాయి. స్వీడిష్‌ బ్రాండ్‌ హెచ్‌అండ్‌ఎం ఇటీవలే భారత్‌లో బ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించగా, రిలయన్స్‌కి చెందిన టీరాతో కలిసి పాప్‌ ఐకాన్‌ రిహానా తన ఫెంటీ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. అటు ఎంఏసీ, హుడా, అనస్టాషియా బెవర్లీ హిల్స్, స్మాష్‌బాక్స్, చార్లొట్‌ టిల్‌బరీ కూడా రంగంలోకి దిగాయి. ఇక ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కొరియన్‌ కంటంట్‌కి ఆదరణ పెరుగుతుండటంతో, ప్రీమియం ఉత్పత్తులతో ఇన్నిస్‌ఫ్రీ, కాస్‌ఆర్‌ఎక్స్, బ్యూటీ ఆఫ్‌ జోసియోన్‌లాంటి కొరియన్‌ బ్రాండ్లు కూడా భారత వినియోగదారులకు గాలమేస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement