చైనాను వెనక్కి నెట్టిన భారత్‌

India Crossed China In Financial Inclusion Said By Report - Sakshi

ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం

సౌమ్య కాంతి ఘోష్‌ నివేదిక  

ముంబై: ప్రజలందరికీ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) విషయంలో చైనాను భారత్‌ అధిగమించిందని ఒక నివేదిక పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ ఈ మేరకు రాసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

- భారత్‌లో మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల సంఖ్య 2015లో  వెయ్యి మందికి 183. 2020లో ఈ సంఖ్య 13,615కు చేరింది. ఇక బ్యాంక్‌ శాఖల సంఖ్య  లక్ష మంది పెద్దలకు 13.6 ఉంటే, ఇది 2020 నాటికి 14.7కు ఎగసింది. ఈ గణాంకాలు జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ. 
- ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం, బ్యాంకు ఖాతాల విషయంలో ముందున్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీయంగా తగ్గాయి.  నేరాలూ తగ్గుముఖం పట్టాయి.  ఆర్థికాభివృద్ధి విషయంలో ఆయా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకంటే ముందుండడం గమనార్హం. 

- జన్‌ ధన్‌ వంటి నో–ఫ్రిల్స్‌ (చార్జీలు లేని) ఖాతాల పథకం కింద, బ్యాంకుల వద్ద డిపాజిట్‌ ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  తోటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే పరిస్థితి పూర్తి సానుకూలంగా ఉంది. ఆర్థిక అక్షరాస్యత గణనీయంగా మెరుగుపడుతోంది. 

 -డిజిటల్‌ చెల్లింపుల వినియోగం పరంగా కూడా చెప్పుకోదగ్గ పురోగతి ఉంది. అందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగంగా గత ఏడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే, 2021 అక్టోబర్‌ 20వ తేదీ నాటికి డిపాజిట్ల పరిమాణం రూ. 1.46 లక్షల కోట్లకు  చేరగా, నో–ఫ్రిల్స్‌ బ్యాంక్‌ ఖాతాల సంఖ్య 43.7 కోట్లకు ఎగసింది. వీటిలో దాదాపు మూడింట రెండు వంతులు గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాలు ఉండడం గమనార్హం. అలాగే ఖాతాల్లో 78 శాతానికి పైగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్నాయి. 18.2 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి. కేవలం మూడు శాతం ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి.  ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్‌ రంగం కీలక భూమికను పోషిస్తోంది. 

- గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల సంఖ్య 2010 మార్చిలో 33,378.  2020 డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 55,073కి పెరిగింది. గ్రామీణ బ్యాంకింగ్‌ శాఖలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల (బీసీ) సంఖ్య 2010 మార్చిలో 34,174. 2020 డిసెంబర్‌ నాటికి  12.4 లక్షలకు పెరిగింది. 
- ఈ కాలంలో లక్ష మంది పెద్దలకు వాణిజ్య బ్యాంకు శాఖల సంఖ్య 13.5 నుండి 14.7కి పెరిగింది. వెయ్యి మంది పెద్దలకు బ్యాంకుల్లో డిపాజిట్‌ ఖాతాల సంఖ్య 1,536 నుంచి 2,031కి ఎగసింది. రుణ ఖాతాల సంఖ్య 154 నుంచి 267కి పెరిగాయి. మొబైల్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల సంఖ్య 183 నుంచి 13,615కి పెరిగాయి. 
- మొత్తం 44 కోట్ల నో–ఫ్రిల్స్‌ ఖాతాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటా 34 కోట్లు. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల వాటా కేవలం 1.3 కోట్లు.

చదవండి: కదులుతున్న చైనా పునాదులు, రియాలిటీ రంగంలో మరో దెబ్బ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top