
ఆస్పత్రులకు పన్నులపరంగా ప్రోత్సాహకాలివ్వాలి
అప్పుడే మెడికల్ టూరిజం హబ్‌గా ఎదగడం సాధ్యం
కేపీఎంజీ, ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: 2035 నాటికి భారత్ అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా ఎదగాలంటే విదేశీ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఓ నివేదిక సూచించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగ అంకుర సంస్థలకు మరింత తోడ్పాటు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
కేపీఎంజీ ఇన్ ఇండియా, భారతీయ హోటళ్లు, రెస్టారెంట్ అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2025లో 18.2 బిలియన్ డాలర్లుగా ఉండే భారత మెడికల్ టూరిజం మార్కెట్ వార్షికంగా 12.3 శాతం వృద్ధితో 2035 నాటికి 58.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది.
ఈ నేపథ్యంలో దీనికి తోడ్పాటు అందించేందుకు ఎంబసీలు, ఎగ్జిబిషన్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా అంతర్జాతీయంగా బ్రాండింగ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రిపోర్ట్ సూచించింది. అలాగే, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో ’హీల్ ఇన్ ఇండియా’ మిషన్‌ను ఆవిష్కరించాలని పేర్కొంది. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు, సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వం ద్రవ్యేతర, ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
అంతర్జాతీయ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరంగా మినహాయింపులు ఇవ్వొచ్చు. మార్కెటింగ్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ స్కీము కింద సబ్సిడీలను పెంచవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫాంలు సహా ఇతరత్రా మాధ్యమాల్లో మార్కెటింగ్, ప్రమోషన్ కోసం సాంకేతిక సహకారం అందించవచ్చు. అలాగే వెల్‌నెస్ సెంటర్లు సహా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విభాగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చు‘ అని నివేదిక తెలిపింది.
మరిన్ని విశేషాలు..
→ మెడికల్ టూరిజానికి ప్రత్యక్షంగా దోహదపడే హెల్త్–టెక్, వైద్య పరిశోధనలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్ల విభాగాల్లో పని చేసే స్టార్టప్‌లు, ఇతర సంస్థలకు నిర్దిష్ట సబ్సిడీలు, గ్రాంట్లు ఇవ్వాలి.
→ భారత ఆస్పత్రులను కూడా తమ నెట్‌వర్క్‌ల్లో జోడించుకునేందుకు అంతర్జాతీయ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తూ బీమా పోర్టబిలిటీ వెసులుబాటును తీసుకురావచ్చు. దీనితో విదేశీ పేషంట్లకు ఆర్థిక ప్రతిబంధకాలు తగ్గుతాయి. బీమా ఉన్న విదేశీ పేషంట్లకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది.
→ వీసా–ఇన్సూరెన్స్ లింకేజీ మధ్య అంతరాలను తగ్గించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో, బహు భాషల్లో సేవలందించేలా ఆస్పత్రుల్లో సిబ్బందికి శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలి.
→ మెడికల్, వెల్‌నెస్ టూరిజంపై జాతీయ వ్యూ హం, మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో మిషన్ ఏర్పాటు చేయాలి.
→ పాలసీల అమలు, అంతర్–మంత్రిత్వ శాఖల సమన్వయం కోసం జాతీయ మెడికల్, వెల్‌నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డును సమగ్ర జాతీయ మిషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలి.
→ మెడికల్ టూరిజం సూచీలో భారత్ 10వ ర్యాంకులో, వెల్‌నెస్ టూరిజంలో 7వ స్థానంలో ఉంది.
→ 2024లో భారత్ 4,63,725 మెడికల్ వీసాలను జారీ చేసింది. మెజారిటీ పేషంట్లు బంగ్లాదేశ్, జీసీసీ దేశాలు, ఆఫ్రికా నుంచి వచ్చారు.
→ 2024లో అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం మార్కెట్ 41.75 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా.