
ఆదాయపన్ను రిఫండ్‌లు, రిటర్నులు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ పాలనలో గణనీయంగా పెరిగాయి. యూపీఏ–2 పాలనలో చివరి ఆర్థిక సంవత్సరం 2013–14లో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ చేసిన చెల్లింపులు (రిఫండ్) రూ.83,008 కోట్లుగా ఉంటే.. 2024–25 సంవత్సరం (ఎన్‌డీఏ పాలనలో 11వ సంవత్సరం) నాటికి రిఫండ్‌లు రూ.4.77 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 474 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు 2013–14 సంవత్సరంలో ఐటీ రిఫండ్‌లకు 93 రోజుల సగటు వ్యవధి తీసుకోగా, అది 2024–25 సంవత్సరానికి 17 రోజులకు తగ్గింది.
ఇక ఈ పదేళ్లలో స్థూల పన్ను వసూళ్లు, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలోనూ మంచి వృద్ధి కనిపించింది. 2013–14 సంవత్సరానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంటే, 2024–25 సంవత్సరంలో ఈ మొత్తం రూ.27.03 లక్షల కోట్లకు పెరిగింది. ఐటీ రిటర్నుల దాఖలు 133 శాతం పెరిగింది. 2013లో 3.8 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలు కాగా, 2024లో 8.89 కోట్ల ఐటీఆర్‌లు నమోదయ్యాయి.
వ్యవస్థ మార్పు ఫలితమే
పన్ను రిఫండ్‌లు గణనీయంగా పెరగడం, రిఫండ్‌ల కాలవ్యవధి కూడా 17 రోజులకు తగ్గడం అన్నది పన్ను యంత్రాంగంలో వచ్చిన మార్పు ఫలితమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా డిజిటల్ వసతులు, పూర్తిగా ఆన్‌లైన్లోనే రిటర్నుల దాఖలు, ప్రత్యక్ష హాజరు అవసరం లేని పన్ను రిటర్నుల మదింపులు (ఫేస్‌లెస్) అన్నవి ఐటీఆర్‌లను మరింత కచ్చితత్వంతో ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నాయి.
ముందుగానే భర్తీ అయిన పన్ను రిటర్నులు (టీడీఎస్, ఫామ్ 16, 26ఏఎస్ తదితర మార్గాల్లో వచ్చిన సమాచారంతో నిండినవి), రిఫండ్ ప్రాసెస్‌ను ఆటోమేట్ చేయడం, టీడీఎస్ సర్దుబాట్లు, ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల పరిష్కారం అన్నవి కాల వ్యవధిని తగ్గించి, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవానికి తోడ్పడుతున్నట్టు తెలిపాయి. 2013–14లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రిఫండ్‌లు 11.5 శాతంగా ఉంటే, 2024–25లో 17.6 శాతానికి పెరగడం గమనార్హం. ‘‘పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరించడం, ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్ యంత్రాంగం మరింత బలంగా మారినప్పుడు రిఫండ్‌లు సైతం పెరగడం సాధారణమే. వ్యవస్థలో పరిణతికి ఇది నిదర్శనం’’అని ఆ వర్గాలు తెలిపాయి.