
ఎఫ్‌వై 2026లో రూ.10,500 కోట్ల స్థాయిలో ఉండొచ్చు
దేశీ విమానయాన పరిశ్రమపై ఇక్రా అంచనా
భౌగోళిక–రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలే కారణం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వివాదాలు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశీ విమానయాన రంగం నష్టాలు రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 5,500 కోట్ల స్థాయిలో ఉండగా ఈసారి రూ. 9,500–10,500 కోట్ల స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని వివరించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 4–6 శాతం వృద్ధితో 17.2–17.6 కోట్లుగా నమోదు కావచ్చని ఇక్రా తెలిపింది.
ఇది గతంలో వేసిన 7–10 శాతం అంచనాల కన్నా తక్కువ కావడం గమనార్హం. ‘ఒకవైపు విమానాల డెలివరీలు పెరుగుతున్న తరుణంలో ప్యాసింజర్ల రద్దీ తగ్గడం వల్ల భారతీయ ఏవియేషన్ పరిశ్రమ నష్టాలు 2025 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 5,500 కోట్లతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగి రూ. 9,500 – 10,500 కోట్లకు చేరే అవకాశం ఉంది‘ అని ఇక్రా వివరించింది.
సీమాంతర ఉద్రిక్తతలతో సర్విసుల్లో అంతరాయాలు, ఫ్లయిట్ల రద్దు, ఎయిరిండియా విమాన దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణాలపై సందిగ్ధతలు తదితర అంశాల వల్ల తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 4.4 శాతానికి పరిమితమైనట్లు తెలిపింది. అలాగే, రాబడులు కూడా 4–5 శాతం తగ్గాయని వివరించింది. సుదీర్ఘ కాలం పాటు వర్షాలు కొనసాగడంతో జూలై–ఆగస్టులో కూడా విమాన ప్రయాణాలపై ప్రభావం పడి ఉంటుందని, ఇక అమెరికా టారిఫ్‌లతో తలెత్తే వాణిజ్య ఉద్రిక్తతలు సైతం రాబోయే త్రైమాసికాల్లో వ్యాపార సెంటిమెంట్లను దెబ్బతీసి, ప్రయాణాలపై పునరాలోచనలో పడే పరిస్థితి ఏర్పడవచ్చని ఇక్రా తెలిపింది.
జూలైలో తగ్గిన ప్రయాణికులు..
దేశీయంగా జూలైలో విమాన ప్రయాణికుల రద్దీ 2.94 శాతం క్షీణించి 1.26 కోట్లకు పరిమితమైంది. గతేడాది జూలైలో 1.29 కోట్ల మంది దేశీ రూట్లలో ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం జనవరి–జూలై మధ్య కాలంలో ప్రయాణికుల సంఖ్య 9.77 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 9.23 కోట్లతో పోలిస్తే 5.9 శాతం పెరిగింది. జూలైలో ఎయిరిండియా గ్రూప్ మార్కెట్ వాటా 26.2 శాతంగా, ఇండిగో 65.2%, ఆకాశ ఎయిర్ 5.5 శాతం, స్పైస్‌జెట్ వాటా 2 శాతంగా ఉంది. ఇండిగో అత్యధికంగా 82.15 లక్షల మందిని, ఎయిరిండియా గ్రూప్ 33.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి.