హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ ఐపీవో.. భలే రెస్పాన్స్‌ | Happiest minds ipo generates huge response | Sakshi
Sakshi News home page

హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ ఐపీవో.. భలే రెస్పాన్స్‌

Sep 9 2020 1:20 PM | Updated on Sep 9 2020 1:22 PM

Happiest minds ipo generates huge response - Sakshi

డిజిటల్‌ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సేవలందించే హ్యాపీయెస్ట్ మైండ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు(9న) ముగియనుంది. సోమవారం ప్రారంభమైన ఇష్యూ నేటి మధ్యాహ్నానికల్లా 34 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా 2.3 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 79.44 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్‌ విభాగంలో 50 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 80 రెట్లు అధికంగా స్పందన లభించగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 6 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. 

ఇతర వివరాలు..
హ్యాపీయెస్ట్ మైండ్స్‌ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 165-166కాగా.. రూ. 702 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేరు ముఖ విలువ రూ. 2కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్కో లాట్‌ 90 షేర్లుగా నిర్ణయించారు. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షలకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా కంపెనీ తొలినాళ్లలో ఇన్వెస్ట్‌ చేసిన జేపీ మోర్గాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన సీఎండీబీ-2 తమకున్న 19.4 శాతం వాటా(2.72 కోట్ల షేర్లకుపైగా) విక్రయించనుంది. ప్రమోటర్‌ అశోక్‌ సూతా 84.14 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఐటీ సర్వీసుల రంగం నుంచి ఇంతక్రితం 2016లో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే.

యాంకర్‌ నిధులు
ఐపీవోలో భాగంగా హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌.. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 316 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 166 ధరలో 1.9 కోట్ల షేర్లను జారీ చేసింది. సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌, జీఐసీ పీటీఈ, ఎవెండస్‌ క్యాపిటల్, ఐఐఎఫ్‌ఎల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర 25 సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. హ్యాపీయెస్ట్ మైండ్స్‌ ఇష్యూకి అనధికార(గ్రే) మార్కెట్లో 50 శాతం ప్రీమియం పలుకుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

బ్యాక్‌గ్రౌండ్..‌
దేశీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్‌ సూతా 2011లో హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్‌, సెక్యూరిటీ, అనలిటిక్స్‌ విభాగాలలో సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో  రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్‌ టెక్నాలజీస్‌ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌, ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement