
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ ఓ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు తమ దాడులను వేగవంతం చేస్తున్నారని.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ప్రారంభించాలని కోరింది.
ఇప్పటికే చాలా మంది ప్రజలు హ్యాకర్స్ బారిన పడ్డారు. షైనీహంటర్స్ అనే అంతర్జాతీయ హ్యాకర్స్ ముఠా.. కూడా దీని వెనుక ఉన్నట్లు గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది. 2020 నుంచి ఏటీ&టీ, మైక్రోసాఫ్ట్, సాంటాండర్, టికెట్‌మాస్టర్ వంటి కంపెనీల డేటా లీక్ కేసులో ఈ గ్రూప్ ప్రమేయం ఉందని పేర్కొంది. దీనికోసం హ్యాకర్స్ ఫిషింగ్ పద్దతిని ప్రధానంగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
యూజర్లకు ఫేక్ మెయిల్స్ పంపి.. వేరొక లాగిన్ పేజిలోకి మళ్లించడం, తద్వారా సెక్యూరిటీ కోడ్స్ వంటి సమాచారాన్ని దోచుకోవడం హ్యాకర్స్ పని. సెక్యూరిటీ కోడ్స్ హ్యాకర్స్ చేతికి వెళ్తే.. తరువాత జరిగే నష్టాలను అంచనా వేసుకోవచ్చు. షైనీహంటర్స్ గ్రూప్ ఒక డేటా లీక్ సైట్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది, ఇది సున్నితమైన సమాచారం దోచుకునే అవకాశం ఉందని గూగుల్ ఇప్పటికే ఒక బ్లాగ్‌పోస్ట్ ద్వారా వెల్లడించింది.
ఇదీ చదవండి: భారత్‌లోకి మళ్ళీ టిక్‌టాక్?: మొదలైన నియామకాలు
టూ స్టెప్ వెరిఫికేషన్ ఎందుకంటే?
ఒక ఈమెయిల్‌కు మరింత సెక్యూరిటీ కావాలనుకుంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. హ్యాకర్స్ మీ ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను తెలుసుకున్నప్పటికీ.. టూ స్టెప్ వెరిఫికేషన్ లేకుండా లాగిన్ అవ్వలేరు. ఇది మీకు సంబంధించిన ఈమెయిల్‌లోని సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్స్ భారీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సులువైన మార్గం.