
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. హైదరాబాద్, బెంగళూరులోని యువతకు ఉద్యోగ నైపుణ్యాల శిక్షణనివ్వడంతో పాటు అవకాశాలను కూడా దక్కించుకోవడంలో తోడ్పాటు అందించనున్నాయి. ఈ ప్రోగ్రాం కింద 540 మందికి ట్రైనింగ్ కల్పించనుండగా, వీరిలో కనీసం 70 శాతం మంది మహిళలు ఉంటారు.
సుమారు 380 మంది ట్రైనీలకు బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో పాల్గొన్న వారి కుటుంబాలతో పాటు సుమారు 2,700 మందికి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. బీఎఫ్‌ఎస్‌ఐ కంటెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్‌లో మాట్లాడటం మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు.
ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్‌లు ఇదివరకే భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అది సత్ఫలితాలను ఇవ్వడంతో మరోసారి యువతకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ భాగస్వామ్యంతో గతంలో 546 మంది యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. వీరిలో 73 శాతం మంది అర్థవంతమైన ఉపాధి అవకాశాల నుండి ప్రయోజనం పొందుతున్నారు. నిర్మాణాత్మక పోస్ట్-ప్లేస్మెంట్ ట్రాకింగ్ ద్వారా యువతకు ఉపాధిని మరింత పెంచడం, దీర్ఘకాలిక ఉద్యోగ నిలుపుదల, స్థిరమైన ఆదాయ వృద్ధికి మద్దతు ఇవ్వడం కొత్త ప్రాజెక్ట్ లక్ష్యం.