పెట్రోల్‌ డిమాండ్‌ తగ్గేదేలే!

Fitch Rating Says Fuel Demand Increased In Q4 Of FY 2022 - Sakshi

ఇంధనానికి కొనసాగనున్న డిమాండ్‌

ఎకానమీ రికవరీ ఊతం 

కేసులు పెరిగితే రిస్కులు పొంచి ఉన్నాయి 

క్యూ4పై ఫిచ్‌ రేటింగ్స్‌ నివేదిక   

న్యూఢిల్లీ: కోవిడ్‌–19పరమైన ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ, ప్రస్తుత త్రైమాసికంలో దేశీయంగా ఇంధనానికి డిమాండ్‌ మెరుగుపడటం కొనసాగనుంది. అయితే, కొంగొత్త వేరియంట్లతో కేసులు పెరగడం, తత్ఫలితంగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాల వల్ల ఆర్థిక వ్యవస్థ, ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడే రిస్కులు కూడా పొంచి ఉన్నాయి. ఒక నివేదికలో ఫిచ్‌ రేటింగ్స్‌ ఈ అంశాలు వెల్లడించింది. ఇంధనానికి డిమాండ్, తద్వారా ధరల పెరుగుదలతో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

క్యూ 4లో
 ‘‘జనవరి–మార్చి త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్‌ మళ్లీ కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మాత్రం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2–4 శాతం తక్కువగానే ఉండవచ్చు’’ అని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. ఫిచ్‌ నివేదిక ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్‌ 5 శాతం మేర పెరిగింది. అయితే, నెలవారీ సగటు మాత్రం కోవిడ్‌ పూర్వ స్థాయికన్నా 8–10 శాతం తక్కువగా సుమారు 16.4 మిలియన్‌ టన్నుల స్థాయిలో నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహమ్మారి కట్టడికి సం బంధించిన ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. ‘‘ కోవిడ్‌–19 కేసుల ఉధృతి, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలపై ప్రభావాల రిస్కులకు లోబడి నాలుగో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు సంబంధించిన రికవరీ కొనసాగవచ్చు’’ అని ఫిచ్‌ తెలిపింది. 

మరింతగా ఓఎంసీల పెట్టుబడులు.. 
రిఫైనింగ్‌ సామర్థ్యాలు, రిటైల్‌ నెట్‌వర్క్‌లను పెంచుకునేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ).. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందు కు తయారీ కంపెనీలు.. మరింతగా ఇన్వెస్ట్‌ చేయ డం కొనసాగించనున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ వివరించింది. ‘‘క్రూడాయిల్‌ ఉత్పత్తి స్థిరంగా కొనసాగవచ్చు. అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలపై ఉత్పత్తి కంపెనీలు మరింతగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక మోస్తరుగా పెరగవచ్చు. దేశీయంగా ఉత్పత్తి పెర గడం, స్పాట్‌ ధరల్లో పెరుగుదల తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులపై ప్రభావం చూపవచ్చు. అయితే, వినియోగం పుంజు కునే కొద్దీ మధ్యకాలికంగా చూస్తే ఎల్‌ఎన్‌జీ దిగుమతులు క్రమంగా పెరగవచ్చు’’ అని ఫిచ్‌ తన నివేదికలో పేర్కొంది. 

మెరుగుపడనున్న రిఫైనింగ్‌ మార్జిన్లు .. 
ఎకానమీ రికవరీ క్రమంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరిగే కొద్దీ కీలకమైన చమురు రిఫైనింగ్‌ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (అక్టోబర్‌ 2021–మార్చి 2022) మెరుగుపడనున్నాయని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. డిమాండ్, ఉత్పత్తి ధర–విక్రయ ధర మధ్య వ్యత్యాసం, తక్కువ రేటుకు కొని పెట్టుకున్న నిల్వల ఊతంతో ప్రథమార్ధంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌ 2021) ప్రభుత్వ రంగ ఓఎంసీలు మెరుగైన మార్జిన్లు నమోదు చేశాయి. ఒక్కో బ్యారెల్‌పై బీపీసీఎల్‌ 5.1 డాలర్లు, ఐవోసీ 6.6 డాలర్లు, హెచ్‌పీసీఎల్‌ 2.9 డాలర్ల స్థాయికి మార్జిన్లు మెరుగుపర్చుకున్నాయి. క్రూడాయిల్‌ అధిక ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కొనసాగించడం ద్వారా ద్వితీయార్ధంలో కూడా ఓఎంసీలు స్థిరంగా మార్కెటింగ్‌ మార్జిన్లను నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top